Vijayasai Reddy: బెదిరింపులకు కేరాఫ్ వైసీపీ ఎంపీ.. రాజకీయ కక్ష సాధిస్తామంటున్న నేత..
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:04 PM
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకున్న విజయసాయిరెడ్డి ఎందరో అధికారులు, విశాఖవాసులను భయపెట్టి, బెదిరించి భూములతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. విజయసాయిరెడ్డిపై ఆరోపణల తీవ్రత పెరగడంతో ఆయనను విశాఖ బాధ్యతల నుంచి..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీరు ఇటీవల కాలంలో వివాదస్పదమవుతుందనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగగా.. ప్రభుత్వం మారిన తర్వాత తన మాట చెల్లడంలేదనే బాధలో విజయసాయిరెడ్డి ఏమి మాట్లాడుతున్నారో అర్థంకాని విధంగా ఉందనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారట. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకున్న విజయసాయిరెడ్డి ఎందరో అధికారులు, విశాఖవాసులను భయపెట్టి, బెదిరించి భూములతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. విజయసాయిరెడ్డిపై ఆరోపణల తీవ్రత పెరగడంతో ఆయనను విశాఖ బాధ్యతల నుంచి తప్పించారనే చర్చ జరిగింది. తాజాగా కాకినాడ పోర్టు కాంట్రాక్టు విషయంలో తనను విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు బెదిరించారంటూ కేవీ రావు ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. దీనిపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విక్రాంత్‌రెడ్డి వయసులో చిన్నవాడని, ఆకారంలోనూ చిన్నవాడని, వయసులో పెద్దవాడైన కేవీ రావును విక్రాంత్‌రెడ్డి ఎలా బెదిరిస్తాడంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఇదే సమయంలో బెదిరించడానికి అధికారం సరిపోతుందని, పరిమాణంతో సంబంధం లేదని కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వీటికి సమాధానం ఇవ్వకుండా సైజులను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయట.
తాజాగా బెదిరింపులు..
సీఐడీ కేసుపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఐదేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తామని, రాగానే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారిని జైల్లో వేస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో అధికారం కోల్పోయినా విజయసాయిరెడ్డి తీరు మారడంలేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు అధికారులపై న్యాయస్థానంలో కేసులు వేస్తామంటూ వ్యవస్థలను సైతం విజయసాయిరెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి బెదిరింపులకు కేరాఫ్ అడ్రస్‌గా మారారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారట. తప్పు చేయకపోతే ఎలాంటి విచారణ చేసుకున్నా సహకరిస్తామని చెప్పకుండా.. గత ఐదేళ్ల కాలానికి కాకుండా కాకినాడ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైనప్పటినుంచి విచారణ చేయాలనే వాదనపైన కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో అధికారాన్ని ఉపయోగించి వైసీపీ కాకినాడ నౌకాశ్రయం కేంద్రంగా ఎన్నో అక్రమాలు, అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, అధికారులను భయబ్రాంతులకు గురిచేసేలా ఆయన వ్యవహారం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ధోరణి మార్చుకుని వ్యవస్థలను గౌరవిస్తారా లేదంటే తప్పుల నుంచి తప్పించుకోవడానికి బెదిరింపు ధోరణిలోనే ముందుకెళ్తారా అనేది వేచిచూడాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here