AP Politics: వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై రఘురామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 05 , 2024 | 02:10 PM
నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు అధిష్టానం బరిలోకి దింపుతోంది..
న్యూఢిల్లీ: నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు అధిష్టానం బరిలోకి దింపుతోంది. అయితే.. టీడీపీ-జనసేన మిత్రపక్షంలో భాగంగా నరసాపురం నుంచి దాదాపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిక్స్ అయ్యారు. ఉమాబాలను అభ్యర్థిగా ప్రకటించాక మొదటిసారిగా రఘురామ స్పందించారు.
జగన్‌కు మాత్రమే..!
‘నాపై పోటీకి రోజుకొక అభ్యర్థి పేరు చెబుతున్నారు. వైసీపీ నాయకురాలు ఉమాబాలను నాపై పోటీకి నిలబెడతామని అంటున్నారు. ఆమెతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే శత్రువును’ అని రఘురామ అన్నారు.
నేర్చుకో జగన్..!
సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ తన సొంత చెల్లెలను, తల్లిని ముందు తిట్టించడం మానేయాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్మును.. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతిని చేశారన్నారు. దీనికి ఏదో మహిళ.. పక్షపాత మహిళ అభ్యుదయ కోసం చేశారని జగన్ అనడం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పూలే, కందుకూరి వీరేశలింగం లా ఫీల్ అవ్వొద్దని రఘురామకృష్ణంరాజు సూచించారు.
గేట్లే లేవు.. ప్రాజెక్టులా..?
అన్నమయ్య డ్యామ్స్ గేట్స్ కట్టని వ్యక్తి.. పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారని సీఎం జగన్‌ను ఉద్దేశించి రఘురామ వ్యాఖ్యలు చేశారు. 2023 లో పోలవరం పూర్తి చేస్తామని జగన్, ఆయన మంత్రులు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2024 వచ్చింది.. పోలవరం పూర్తి చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారని.. అవినీతికి తావులేకుండా చేస్తామంటుంటే ఇలాంటి నటుడిని చూడలేదని రఘురామ వ్యాఖ్యానించారు.