Share News

AP Politics: ముద్రగడ దారెటు.. సైకిలెక్కుతారా.. జనసేనలోకా..!?

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:18 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాపు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాపు లీడర్లను కలిసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. ప్రస్తుతం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరే ఎక్కడ చూసినా వినిపిస్తోంది.

AP Politics: ముద్రగడ దారెటు.. సైకిలెక్కుతారా.. జనసేనలోకా..!?

కాకినాడ, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాపు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాపు లీడర్లను కలిసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. ప్రస్తుతం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) పేరే ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో ముద్రగడే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే.. పద్మనాభం మొన్నటి వరకూ వైసీపీకి మద్దతుగానే ఉన్నారే గానీ అధికారికంగా కండువా కప్పుకోలేదు.

దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఇరు పార్టీల కీలక నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు. దీంతో.. ముద్రగడ ఏ పార్టీలో చేరబోతున్నారు?. టీడీపీలో చేరతారా.. లేక జనసేనలోకా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ముద్రగడ నివాసానికి ఇరు పార్టీలకు చెందిన నేతల రావడం.. ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనేదానిపై కాపు సామాజిక వర్గంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ముద్రగడతో టీడీపీ నేత...

ఈరోజు టీడీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జి జ్యోతుల నెహ్రూ ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. అయితే ముద్రగడతో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు నెహ్రూ చెప్పుకొచ్చారు. ‘‘ముద్రగడ, నేను ఇద్దరం కలిస్తే కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటాం. నాకు మద్దతు ఇమ్మని అడిగా. పార్టీ ఆదేశిస్తే కచ్చితంగా మళ్ళీ వస్తాను. ముద్రగడ నేను ఉన్న పార్టీలోకి రావాలని కోరుకుంటాను’’ అంటూ భేటీ అనంతరం నెహ్రూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.

నిన్న జనసేన నేతల భేటీ...

మరోవైపు నిన్న జనేసన నుంచి కూడా కొందరు నేతలు వచ్చి ముద్రగడతో చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇంచార్జి తాతారావు.. ముద్రగడతో భేటీ అయ్యారు. అయితే ముద్రగడ.. తన కొడుకు లేదా కోడలికి సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ ఏ పార్టీలో చేరతారనే దానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఇటీవల ముద్రగడ తమ పార్టీలో చేరుతున్నారంటు వైసీపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు అదంతా వట్టిదే అని ముద్రగడ అనుచరులు కొట్టిపారేశారు. తాజాగా ముద్రగడతో వరుస భేటీలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 11 , 2024 | 12:51 PM