Share News

AP Elections: ఏపీ గవర్నర్ చతురోక్తులు.. నవ్వుకున్న తెలుగు తమ్ముళ్లు!

ABN , Publish Date - Mar 17 , 2024 | 03:17 AM

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు.

AP Elections: ఏపీ గవర్నర్ చతురోక్తులు.. నవ్వుకున్న తెలుగు తమ్ముళ్లు!

  • వచ్చేది మీరే గా...!

  • టీడీపీ నాయకులతో గవర్నర్‌ చతురోక్తులు

  • గ్రూప్‌-1 పరిణామాలపై విస్మయం

  • మొత్తం వివరాలు తెప్పించాలని అధికారులకు ఆదేశం

  • ఏపీపీఎస్సీ చైర్మన్‌ రీకాల్‌ను కోరిన టీడీపీ నాయకులు

అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు. ‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది మీరేగా! వచ్చిన తర్వాత ఆ విచారణ ఏదో మీరే జరిపించుకోండి’’ అని ఆయన వారితో నవ్వుతూ అన్నారు. తమ గెలుపు ఖాయమని, గవర్నర్‌ నజీర్‌ చేతుల మీదుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము కోరుకొంటున్నామని వారు చెప్పగా, ఆయన కూడా నవ్వారు. గవర్నర్‌ను వారు విజయవాడ రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం కలిశారు.

ఈ బృందంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొమ్మారెడ్డి పట్టాభిరాం ఉన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీని హైకోర్టు కొట్టేసిన నేపఽథ్యంలో, వారు ఆయనను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. జరిగిన విషయాలను వారు ఆయనకు వివరించారు. ‘గ్రూప్‌-1 రాష్ట్రంలో ఉన్నతమైనవి. వాటికోసం లక్షల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సిద్ధం అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇంత పెద్ద పరీక్షలను జగన్‌ ప్రభుత్వంలో అధికారులు ఒక కుంభకోణంగా మార్చేశారు. వీటిని చేతితో దిద్దిస్తామని ముందు ప్రకటించారు. తర్వాత డిజిటల్‌గా దిద్దించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే మళ్లీ చేతితో దిద్దించారు. ఆ ఫలితాలను పక్కన పడవేసి గౌతం సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వచ్చిన తర్వాత మరోసారి దిద్దించారు. మొదటిసారి ఎంపికైన వారికి... రెండోసారి ఎంపికైన వారికి సంబంధమే లేదు. ఒక్కో డిఫ్యూటీ కలెక్టర్‌ పోస్టును రూ. రెండున్నర కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. కోటిన్నరకు అమ్ముకొన్నారు. దీనిపై కోర్టులో విచారణ జరిగితే చేతితో రెండుసార్లు దిద్దించలేదని, ఒకసారి మాత్రమే దిద్దించామని అధికారులు కోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. కానీ రెండుసార్లు దిద్దించినట్లు అభ్యర్థులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. దీంతో కోర్టు ఈ ఎంపికలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది’’ అని వారు వివరించారు.

రెండుసార్లు దిద్దించలేదని అధికారులు కోర్టుకు అఫిడవిట్‌ కూడా సమర్పించారా అని గవర్నర్‌ విస్మ యం వ్యక్తంచేశారు. ఆ అఫిడవిట్‌ కాపీని టీడీపీ నేతలు గవర్నర్‌కు చూపించారు. అసలు ఏం జరిగిందని గవర్నర్‌ తన కార్యదర్శి సింఘాల్‌ను ప్రశ్నించారు. నియామకాలను కోర్టు రద్దు చేసేవరకూ జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్‌కు వివరించా రు. ‘కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని ఉద్యోగాలు పొందిన వారందరూ ముందుగానే అఫిడవిట్లు సమర్పించారు. ఇప్పుడు వారందరి ఉద్యోగాలు పోయినట్లే. వీరిలో కొందరికి ఇప్పుడు ఎన్నికల్లో డ్యూటీలు కూడా వేశారు. అవన్నీ మార్పించాల్సి ఉంది’’ అని ఆ అధికారి... గవర్నర్‌కు చెప్పారు. దీని పై సమగ్ర నివేదిక తెప్పించాలని గవర్నర్‌ తన కార్యదర్శిని ఆదేశించారు. కాగా, గవర్నర్‌తో తమ భేటీ సంతృప్తికరంగా జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.

టీడీపీ డిమాండ్లు ఇవీ..

అక్రమాలు రుజువు అయినందువల్ల ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ను రీకాల్‌ చేయాలి.

ఏపీపీఎస్సీకి కార్యదర్శిగా వ్యవహరించిన మరో ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులుపై కేసు నమోదు చేసి విచారణ జరపాలి.

మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి.

Updated Date - Mar 17 , 2024 | 09:23 AM