Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే
ABN , Publish Date - May 03 , 2024 | 10:18 AM
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
- సెలవుల్లో ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లే టార్గెట్
హైదరాబాద్: ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందులోనూ ఈసారి ఎన్నికల సీజన్ కావడం.. పోలీసులు(Police) బందోబస్తు పనులో నిమగ్నం కావడంతో మరిన్ని దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేది విహారయాత్రలు. పిల్లలకు పరీక్షలు పూర్తికాగానే సరదాగా వారితో కలిసి దూరప్రాంతాలకు, తీర్థయాత్రలకు వెళ్లిరావాలని చాలామంది భావిస్తుంటారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యేవారు వారం, పది రోజుల పాటు సేదతీరడానికి వేసవి సెలవుల్లో ప్లాన్ చేసుకుంటారు. వీటిని ఆసరా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. అందరికీ హాలీడేస్ అయిన వేసవిని దొంగలు వర్కింగ్ డేస్‌గా మార్చుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: Father: ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా.. తండ్రిపై కుమారుడి దారుణ దాడి
యాత్రలు అధికం...
వేసవిలో వివాహాలు, విహారయాత్రలకు ప్రజలు అధికంగా వెళ్తుంటారు. దీంతో ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. దీన్ని దొంగలు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎండాకాలం ఎక్కువగా డోర్లు, కిటికీలు తెరిచిఉంచుతారు. ఇది కూడా దొంగలకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఒకరిద్దరున్న సందర్భంలో వారిని మాటలతో మభ్యపెట్టి చోరీలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఎక్కువగా వేసవిలోనే జరుగుతున్నాయి. వేసవిలో షాపింగ్‌లకు, పార్కులకు, వినోద ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయా సందర్భాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రద్దీగా ఉండే చోట బ్యాగులను, పర్సులను దోచేస్తున్నారు.
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
దొంగలు ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఇళ్లల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళాన్ని పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. అల్వాల్‌లో తాజాగా తాళాలు వేసిన ఇళ్లల్లోనే దొంగలు పడి నగదు, విలువైన బంగారు అభరణాలను దోచుకుని పారిపోయారు.
పోలీసులకు సమాచారం ఇవ్వండి..
సెలవులకు యాత్రలు, సొంతూర్లకు వెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. వారు తిరిగి వచ్చేవరకు ఆ ఇళ్లపై నిఘా పెడుతాం. విలువైన నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్‌లాకర్లల్లో భద్రపర్చుకోవాలి. డయల్ 100 లేదా అల్వాల్ సర్కిల్ స్టేషన్ హౌజ్‌ఆఫీసర్ నంబర్ 9490617215, డీఐ నంబర్ 9490617375లో మెసేజ్, వాట్సప్ లేదా నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు.
- రాహుల్‌దేవ్, స్టేషన్‌హౌజ్ ఆఫీసర్, అల్వాల్
ఇదికూడా చదవండి: Hyderabad: నకిలీ పత్రాలతో రూ. 3.13 కోట్ల మోసం..
Read Latest Telangana News And Telugu News
Read Latest AP News and Telugu News