Kadiri: సీఐ వేధింపులు తాళలేక మూడేళ్లుగా అదృశ్యం.. చివరికి యువకుడు..
ABN , Publish Date - Sep 27 , 2024 | 04:07 PM
మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో కదిరి రూరల్ మండలం యర్రదొడ్డి గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడిపై సీఐ మధు అన్యాయంగా దాడి చేశారు. దీనిపై కేసు పెట్టేందుకు బాధితుడు కదిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు.
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో ఓ సీఐ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు ఉన్న సీఐ తమ్మిశెట్టి మధు బెదిరింపులకు దిగడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగన్ హయాంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారనే ఆరోపణలు సైతం మధుపై ఉన్నాయి. తాజాగా ఆయన వేధింపులు తాళలేక ఓ నిండు ప్రాణం బలైంది. ఆత్మహత్యకు సంబంధించిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో కదిరి రూరల్ మండలం యర్రదొడ్డి గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడిపై సీఐ మధు అన్యాయంగా దాడి చేశారు. దీనిపై కేసు పెట్టేందుకు బాధితుడు కదిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు అనంతపురం కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. అయితే అప్పట్నుంచి ఉదయ్‌పై పగ పెంచుకున్న సీఐ.. కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగడం మెుదలుపెట్టాడు. ఉదయ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మధు వేధింపులు పెరిగిపోవడంతో యువకుడు మూడేళ్లుపాటు గ్రామం వదిలిపెట్టి వెళ్లి దూరంగా తలదాచుకున్నాడు.
అయితే తాజాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితుడు ఉదయ్ తిరిగి స్వగ్రామం వచ్చాడు. అయితే యువకుడిపై సీఐ బెదిరింపులు, వేధింపులు ఏమాత్రం తగ్గలేదు. కేసు వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ రోజూ భయభ్రాంతులకు గురి చేసేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక, తనకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో యువకుడు ఇవాళ(శుక్రవారం) ఉదయం స్వగ్రామంలోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బలవన్మరణానికి సీఐ మధు వేధింపులే కారణమంటూ... మెుదట్నుంచీ తనపై జరిగిన దారుణాల్ని సూసైడ్ నోట్‌లో వివరించి ప్రాణాలు తీసుకున్నాడు.
అయితే ఉదయ్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తమ కుమారుడి మృతికి సీఐ మధునే కారణమంటూ యువకుడి తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్ మృతిపై విచారణ జరిపి సీఐ మధుని కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: తిరుమలకు వెళ్లేవారు ఆ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు..
Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
AP-Karnataka: ఏపీ, కర్నాటక ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం.. ఏ విషయంలో అంటే
Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం