మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. చలిగా ఉందని ఏకంగా రైలులోనే మంట పెట్టేశారు..
ABN , Publish Date - Jan 06 , 2024 | 03:47 PM
చలి రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారు జాము నుంచే పొగమంచు కమ్మేస్తోంది. పలు చోట్ల విపరీతంగా మంచు కురుస్తోంది.
చలి రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారు జాము నుంచే పొగమంచు కమ్మేస్తోంది. పలు చోట్ల విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులు కనిపించక వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వాళ్లకేనా చలి.. ప్రయాణికులకూ చలి ఉంటుంది కదా.. మరి వారు చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు స్వెట్టర్లు వేసుకోవడం, దుప్పట్లు కప్పుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం ఏకంగా కదులుతున్న రైల్లోనే చలిమంటలు వేసి చలి కాచుకున్నారు. రైలు నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అస్సాం నుంచి ఢిల్లీకి వెళుతోంది. అదే సమయంలో జనరల్ కోచ్ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడాన్ని ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోచ్ వద్దకు చేరుకున్నారు. భోగిలో ఉన్న కొందరు వ్యక్తులు చలి మంట కాచుకుంటున్నారు. సీన్ చూసి అవాక్కయిన పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పించారు. అనంతం భోగీలో ఉన్న చందన్, దేవేంద్ర అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని అలీగఢ్‌లోని ఆర్‌పీఎఫ్ పీఎస్ కు తరలించారు.
నిందితిలు ఇద్దరిని ఫరీదాబాద్ వాసులుగా గుర్తించారు. చలి ఎక్కువగా ఉండడం వల్లే తట్టుకోలేక మంట వెలిగించామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. వారి దగ్గర పిడకలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. నిందితులను రైల్వే చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఆర్పీఎఫ్ అలీఘర్ పోస్ట్ కమాండర్ రాజీవ్ శర్మ చెప్పారు.
"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."