TG Elections: హరీశ్ వర్సెస్ సీఎం రేవంత్.. రుణమాఫీ అమలుపై సవాళ్లు
ABN , Publish Date - Apr 24 , 2024 | 08:50 PM
తెలంగాణ గడ్డపై రుణమాఫీ అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఆగస్టు 16వతేదీ లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణ మాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ గడ్డపై రుణమాఫీ అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఆగస్టు 16వతేదీ లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణ మాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు. ఇక భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లో పోటీ చేయనని వివరించారు. హరీశ్ రావు సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వీకరించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని ఉండాలని ప్రతి సవాల్ విసిరారు.
‘నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ముఠా రాజకీయాలు, కొట్లాటలు. ఖమ్మం ప్రజలు తాగునీరు రాక, రైతులు సాగు నీరు రాక ఇబ్బంది పడుతున్నారు. టికెట్ల కోసం మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పూటకు ఒక పేరు వస్తుంది. జిల్లా వారే కాకుండా బయట వారిని తీసుకుని వస్తా అంటున్నారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని అనుకుంటే ఈ జిల్లాలో ముగ్గురికి మాత్రమే నౌకరీ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ మీద తొలి సంతకం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని మరిచారు. కాంగ్రెస్ పాలనలో ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సే. మహిళలకు 2500 ఇస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఓడ దాటే దాక ఓడ మల్లన్న ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఉంది అని’ మండిపడ్డారు.
‘ప్రజలు కేసిఆర్ వైపు, మీ వైపు చూస్తున్నారు, ప్రజలకు కాంగ్రెస్ మోసాలను చెప్పండి. కాంగ్రెస్ పార్టీనీ అసెంబ్లీలో మెడలు వంచి గ్యారెంటిలను అమలు చేసేలా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడినా ప్రభుత్వమేమీ పడిపోదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు పూర్తి సమయం వచ్చిన వాటిని అమలు చేయలేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు.. రాహుల్ గాందీ అదానీ చోర్ అంటారు, రేవంత్ రెడ్డి అదానీ మంచివాడు అంటారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని భాయ్ అంటారు, నరేంద్ర మోదీనీ బడే భాయ్ అంటారు. మళ్ళీ తిరిగి మోదీ ప్రధాని కావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా..? రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మైనార్టీ మంత్రి లేరు. టీడీపీ, బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది మైనార్టీ మంత్రులు ఉన్నారు. నరేంద్ర మోదీకి భయపడి ఒక్క మైనార్టీ మంత్రికి రేవంత్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చెప్పుకుంటారు, ఆయన ఎప్పుడైనా బీజేపీ లోకి వెళ్ళే అవకాశం ఉంది అని’ హరీశ్ రావు స్పష్టం చేశారు.
Read Latest Telangana News And Telugu News