Share News

Curry Leaves Tea: కరివేపాకు టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ABN , Publish Date - Aug 31 , 2024 | 07:48 AM

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో టీ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Curry Leaves Tea: కరివేపాకు టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కరివేపాకుకు అనేక ఔషధ గుణాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే మన పూర్వీకులు దాన్ని వంట గదిలోకి తెచ్చారు. మనం ఇప్పటికీ కరివేపాకు లేకుండా దాదాపు ఎటువంటి వంటకం చేయమంటే అతిశయోక్తి కాదు. దీనిలో ఉండే విటమిన్లు, పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో టీ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది..

కరివేపాకు టీతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అందుకే బ్లాక్ టీ, గ్రీన్ టీలే కాకుండా అప్పుడప్పుడు కరివేపాకు టీ కూడా తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. దీని వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. వారానికి ఒకటి, రెండుసార్లయినా తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తాయని చెప్తున్నారు. అలాగే గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థకు వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఇది కాపాడుతూ రక్షణ కవచంగా పని చేస్తుంది.


అదుపులో డయాబెటిస్..

కరివేపాకు టీ తరచుగా తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇది మన శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను బయటకు పంపించి వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అలాగే పలు రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కరివేపాకు టీతో ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. ఇది శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచుగా దీన్ని సేవించడం మంచిది.


చర్మ సమస్యలకు చెక్..

కరివేపాకు టీతో అనేక చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీన్ని సేవించడం వల్ల చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇతర చర్మ వ్యాధులు నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయపడొచ్చు. ఆధునిక ప్రపంచంలో అందరూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. వీటిని దరిచేరకుండా చేయాలంటే తరచుగా కరివేపాకు టీ తాగాలని చెప్తున్నారు. అలాగే జుట్టు రాలే సమస్యను సహితం ఇది నివారిస్తుంది. రుతుస్రావం సమయంలో మహిళలు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో ఇది సేవించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఉదయానే పరిగడుపున కరివేపాకు టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Aug 31 , 2024 | 07:48 AM