Share News

Urine problems: మూత్రం దుర్వాసన వస్తోందా.. అయితే జాగ్రత్త..

ABN , Publish Date - Sep 27 , 2024 | 05:30 PM

జీర్ణక్రియలో భాగంగా ఆహారం, నీటిని శరీరం శోషించుకుంటుంది. మిగిలిన వ్యర్థాలు, అధిక నీరు మూత్రపిండాలకు చేరుకోగా, వాటిని ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో కిడ్నీలు బయటకు పంపుతాయి. అలా వచ్చే మూత్రం అసాధారణమైన వాసన వస్తే మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులు చెప్తున్నారు.

Urine problems: మూత్రం దుర్వాసన వస్తోందా.. అయితే జాగ్రత్త..

ఇంటర్నెట్ డెస్క్: మనం తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియ ద్వారా శరీరం శక్తిగా మారుస్తుంది. మిగిలిన వ్యర్థ పదార్థాలను మలం, మూత్రం, చమట ద్వారా శరీరం బయటకు విడుదల చేస్తుంది. వీటిని విసర్జించే సమయంలో సాధారణంగా దుర్వాసన రావడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రం అనేది భరించలేనంత చెడు వాసన వస్తుంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. మూత్రం దుర్వాసన రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


జీర్ణక్రియలో భాగంగా ఆహారం, నీటిని శరీరం శోషించుకుంటుంది. మిగిలిన వ్యర్థాలు, అధిక నీరు మూత్రపిండాలకు చేరుకోగా, వాటిని ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో కిడ్నీలు బయటకు పంపుతాయి. అలా వచ్చే మూత్రం అసాధారణమైన వాసన వస్తే మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులు చెప్తున్నారు. మనం తీసుకునే ఆహారం, అనారోగ్య సమస్యలు, వాడే మందులు వంటివి మూత్రం వాసనను ప్రభావితం వైద్య నిపుణులు చెప్తున్నారు.


  • షుగర్ వ్యాధి ఉన్నవారి మూత్రంలో గ్లూకోజ్ శాతం పెరగడం వల్ల వాసన వచ్చే అవకాశం ఉంది. దీన్ని డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే తీవ్రమైన పరిస్థితిగా వైద్యులు చెప్తుంటారు. దీని వల్ల రోగి శరీరంలో క్యాటోన్స్ పేరుకుపోయి మూత్రం విసర్జించేటప్పుడు తీవ్రమైన దుర్వాసన వస్తుందని చెప్తున్నారు.

  • శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే.. అంటే తాగాల్సిన నీరు కంటే తక్కువ తాగితే మూత్రం మరింత సాంద్రంగా మారుతుంది. దీని వల్ల మూత్రంలో నైత్రజని, ఉప్పు, వ్యర్థాల శాతం పెరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మూత్రం పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది. ఇలాంటప్పుడు విసర్జించే సమయంలో వేడితో కూడిన దుర్వాసన వస్తుంది. అందుకే రోజుకు తగినంత నీటిని తాగాలని వైద్యులు చెప్తున్నారు.

  • కొన్ని రకాల మందులు, సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా మూత్రం వాసన వస్తుంటుంది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, విటమిన్ బి6 సప్లిమెంట్స్ వంటివి తీసుకున్నప్పుడు చెడు వాసన వచ్చే అవకాశం ఉంది. అలాంటి మందులు శరీరంలో రసాయన మార్పులు చేసి మూత్రం వాసనను ప్రభావితం చేస్తాయి.

  • కొన్ని రకాల ఆహార పదార్థాలు అధికంగా తింటే మూత్రం దుర్వాసన వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉల్లికాడలు, శతావరి వంటివి అధికంగా తింటే వాటిలోని సల్ఫర్ సమ్మేళనాలు మూత్రంలో కలుస్తాయి. దీని వల్ల అసహ్యమైన వాసన వచ్చే అవకాశం ఉంది. మసాలా పదార్థాలు అధికంగా కలిసిన ఆహారం తిన్నా, కొన్ని రకాల పండ్లు ఎక్కువగా తిన్నా సరే మూత్రం వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

  • మద్యపానం, కాఫీ, టీలు అధికంగా తాగే వారిలో మూత్రం అసాధారణమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ద్రవాల్లో కేఫిన్ అధికంగా ఉంటుంది. దీనికి మూత్రం త్వరగా విసర్జించే లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువగా శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని వల్ల మూత్రం చెడు వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి.

  • మూత్రాశయం, మూత్రపిండాలు, మూత్రనాళాల్లో బ్యాక్టీరియా చేరినప్పుడు దుర్వాసన వస్తుంది. మూత్రాశయంలో బ్యాక్టీరియా చేరితే అది అసహ్యమైన లేదా పుదీనా లాంటి వాసనకు దారి తీయెుచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం పచ్చగా మారి చెడు వాసన వస్తుంది. అలాగే కడుపు నొప్పి, మూత్రంలో రక్తం రావడం, అధిక మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • మూత్రపిండాలు సరిగా పనిచేయని వారిలో కూడా మూత్రం తీవ్రమైన దుర్వాసన వస్తుంటుంది. కిడ్నీలు అనేవి మూత్రంలో వ్యర్థాలు పూర్తిగా ఫిల్టర్ చేస్తాయి. అవి అనారోగ్యానికి గురైతే ఆ ప్రక్రియ సజావుగా జరగదు. దీని వల్ల మూత్రం భరించలేని వాసన వస్తుంటుంది.

  • కాలేయం అనేది శరీరంలో వ్యర్థాల్ని శుభ్రపరిచే అద్భుత అవయవం. ఇది అనారోగ్యానికి గురైనప్పుడు మూత్రం మసకబారిన పసుపు రంగుకు మారుతుంది. అలాంటప్పుడు కూడా తీవ్రమైన చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

  • మీ మూత్రం సాధారణం కంటే అధికమైన దుర్వాసన వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయెుద్దు. ఏదో ఒక సమస్య లేనిదే అలా జరగదు. కాబట్టి మూత్రం చెడు వాసన వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Updated Date - Sep 27 , 2024 | 05:30 PM