Skin Problems: చలికాలంలో చర్మం పగిలిపోతుందా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:18 AM
శీతాకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కామన్‌గా కనిపించే సమస్య చర్మం పొడిబారటం. కాళ్లు, చేతులు సహా దాదాపు చాలా చోట్ల చర్మం మెుత్తం పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తుంటుంది. నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపిస్తుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలు అయితే సర్వసాధారణం. వీటికి వైద్యులను సంప్రదించి, మందులు వేసుకుంటే సరిపోతుంది. కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని, మంచి ఆహారం తింటే చాలు. కానీ చలికాలంలో మరికొన్ని రకాల సమస్యలు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి. ఇవి డాక్టర్‌ను కలిసే అంత పెద్దవి కాకపోయినా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అందులో ముఖ్యమైనది.. చర్మం పొడిబారటం.
శీతాకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కామన్‌గా కనిపించే సమస్య చర్మం పొడిబారటం. కాళ్లు, చేతులు సహా దాదాపు చాలా చోట్ల చర్మం మెుత్తం పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తుంటుంది. నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపిస్తుంటుంది. అయితే దీనికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..
శీతాకాలంలో ఎక్కువ మంది నీటికి తాగడంలో అశ్రద్ధ చేస్తుంటారు. సాధారణంగా ఈ కాలంలో దాహం అనిపించకపోవడం ఇందుకు కారణం. అయితే రోజూ తగినంత మంచినీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. అలా చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన నీరు అంది, చర్మం పగిలిపోకుండా ఉంటుంది.
అలాగే కీరదోస తినడం చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండడం, చర్మాన్ని చల్లగా ఉంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే చర్మం పొడిబారకుండా తేమను పెంచే లక్షణాలు దీని సొంతం. కాబట్టి కీరదోస తింటే మంచిది.
శీతాకాలంలో అలోవెరా జెల్, పెట్రోలియం వంటి జెల్లీలతో చర్మాన్ని కాపాడుకోవచ్చు. వీటిని చర్మానికి పట్టించడం ద్వారా పొడిబారిన స్కిన్‌కు ఉపశమనం కలిగిస్తాయి. ఇవి చర్మంలోని సహజ తేమను కాపాడుతూ పగిలిపోయి అసహ్యంగా కనిపించకుండా ఉండేందుకు తోడ్పడతాయి. చర్మంపై సన్నని పొరగా ఉంటూ చలికాలంలో చర్మానికి రక్షణగా ఉంటాయి.
శీతాకాలంలో చర్మం పగిలిపోకుండా ఉండేందుకు పాలు తోడ్పడతాయి. పాలలో నానబెట్టిన దూదితో చర్మంపై అద్దాలి. అలా చేయడం ద్వారా చర్మం పగిలిపోకుండా ఉంటుంది. ఎప్పుడూ తేమగా ఉంటూ నిగారింపును సొంతం చేసుకుంటుంది.
చలికాలంలో చర్మ ఆరోగ్యానికి కొబ్బరినూనె దివ్య ఔషధం అని చెప్పాలి. దీనిలో ఉంటే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి ఎంతో దోహదపడతాయి. చర్మానికి కొబ్బరినూనె అప్లై చేయడం ద్వారా పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. అయితే స్నానానికి అరగంట ముందు శరీరానికి కొబ్బరినూనె పట్టిస్తే మంచిది.
పొడిబారిన చర్మానికి తెనే చాలా ఉపయోగపడుతుంది. చలికాలంలో చర్మానికి తెనేను రాస్తే పొడిబారి పగిలిపోయిన చర్మం రిపేర్ అవుతుంది. అలాగే చర్మం చాలా సున్నితంగా మారుతుంది. మంచి నిగారింపు సొంతం చేసుకుని నవయవ్వనంతో కనిపిస్తారు.