Health News: నిద్ర లేవగానే ఈ పనులు చేస్తున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:28 AM
చాలామంది నిద్రలేచిన వెంటనే మెుబైల్ ఫోన్ చూడడం మెుదలుపెడతారు. అర్ధరాత్రి వరకూ ఫోన్ చూస్తూ పడుకుని మళ్లీ లేచిన వెంటనే అదే పని చేస్తారు. పైగా లేచి తీసుకోవడం కష్టం అవుతుందని పక్కలోనే ఫోన్ పెట్టి మరీ పడుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక ప్రపంచంలో చాలామంది సరైన జీవనశైలి పాటించడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్లడం, తిరిగి వచ్చిన తర్వాత పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుదామని అర్ధరాత్రి వరకూ ఫోన్‌లో మునిగిపోవడం, ఆ తర్వాత చాలీచాలని నిద్రతో మళ్లీ ఉదయాన్నే లేవడం. ఇలాంటి జీవనచక్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సరైన ఆహారం, విశ్రాంతి, వ్యాయామం శరీరానికి, మానసికోల్లాసానికి ఎంతో అవసరం. మంచి ఆరోగ్యానికి ఉత్తమమైన జీవనశైలి అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే ఆరోగ్యానికి హాని చేసే కొన్ని పనులను చాలామంది చేస్తుంటారు. అయితే ఆ పనులు ఎలాంటి దుష్ర్పభావాలు కలిగిస్తాయో వారికి ఏమాత్రం తెలియదు. ఆ పనులు ఏంటి, ఆ అలవాట్ల వల్ల కలిగే నష్టాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది నిద్రలేచిన వెంటనే మెుబైల్ ఫోన్ చూడడం మెుదలుపెడతారు. అర్ధరాత్రి వరకూ ఫోన్ చూస్తూ పడుకుని మళ్లీ లేచిన వెంటనే అదే పని చేస్తారు. పైగా లేచి తీసుకోవడం కష్టం అవుతుందని పక్కలోనే ఫోన్ పెట్టి మరీ పడుకుంటారు. కొంతమంది బాత్ రూమ్‌లో వెళ్లినా ఫోన్ వదిలిపెట్టరు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మునిగిపోతారు. అయితే అలా ఎర్లీ మార్నింగ్ ఫోన్ చూడడం ఏమాత్రం మంచిది కాదు. మెుబైల్ నుంచి వచ్చే కాంతి.. కళ్లు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఉదయం దాని జోలికి వెళ్లకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
నిద్రలేవగానే కొంతమందికి బెడ్ కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. బ్రష్ చేయకుండా అలా నేరుగా కాఫీ, టీ తాగడం మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రష్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
శారీరక వ్యాయామం చేసే అలవాటు చాలామందికి ఉండదు. గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసే వారికి శారీరక శ్రమ కలుగుతుంది. అయితే పట్టణాలు, నగరాల్లో ఆఫీసుల్లో కుర్చొని పని చేసేవారు తప్పకుండా ఉదయాన్నే వ్యాయామం చేయాలి. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయకూడదు. అలా చేస్తే కండరాలపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాసేపు వార్మప్ చేసిన తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి.
చాలామంది ఉదయం హడావిడిగా టిఫిన్ కూడా చేయకుండా ఆఫీసుకు వెళ్తుంటారు. అయితే మార్నింగ్ తినే అల్పహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు.