Geyser water problems: గీజర్ నీళ్లతో స్నానం చేసేవారికి అలర్ట్.. ఇవి తెలుసుకోకపోతే డేంజరే..
ABN , Publish Date - Dec 26 , 2024 | 06:57 AM
చలికాలంలో చాలా మంది వేడి నీళ్లు లేనిదే స్నానం చేసేందుకు సాహసించరు. అయితే గతంలో వేడి నీళ్ల కోసం కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి వినియోగించే వాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి హీటర్, గీజర్ వంటివి వచ్చేశాయి. వాటి ద్వారా వేడి చేసిన నీళ్లతో స్నానం చేయడం అంత మంచిది కాదనే వాదనలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: చలికాలం వచ్చేసింది. నవంబర్ నెల నుంచే చలి మెుదలైనప్పటికీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శరీరం గడ్డకట్టుకుపోయిందా? అనేంతగా చలి పులి పంజా విసురుతుంది. ఈ కాలంలో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే "దేవుడా" అనుకునే పరిస్థితులు ఉంటాయి. ఇక శీతాకాలంలో స్నానం చేయడం అంటే సాహసంగా మారిపోయే పరిస్థితులూ కనిపిస్తుంటాయి. ఎక్కువ మంది వేడి నీళ్లు లేనిదే స్నానం చేసేందుకు సాహసించరు. అయితే గతంలో వేడి నీళ్ల కోసం కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి వినియోగించే వాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి హీటర్, గీజర్ వంటివి వచ్చేశాయి. వాటి ద్వారా వేడి చేసిన నీళ్లతో స్నానం చేయడం అంత మంచిది కాదనే వాదనలు ఉన్నాయి. కొన్నిసార్లు వీటి వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కనిపిస్తుంటాయి. అయినప్పటికీ చాలా మంది వీటిని వాడేందుకు ఇష్టపడతారు. అయితే ఇంట్లో గీజర్ ఉన్నవారు ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గీజర్‌తో ప్రమాదాలు ఇవే..
గీజర్ వినియోగించేవారు చాలా మంది పెద్ద పొరపాటు చేస్తుంటారు. వేడి నీళ్ల కోసం దాన్ని ఆన్ చేస్తారు. కానీ, నీళ్లు కాగిన తర్వాత ఆఫ్ చేయకుండా వేడి నీటిని పట్టుకుని స్నానం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే గీజర్ ఆఫ్ చేయకుండా స్నానం చేసే సమయంలో దాని ద్వారా కరెంట్ పాస్ అయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల స్నానం చేసేవారికి కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తప్పకుండా దాన్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి.
గీజర్ వాడే వాళ్లు దానికి లీకేజీలు లేకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అది లీకేజీకి గురవుతుంది. ఎప్పటికప్పుడు దాన్ని పరీక్షించుకోవాలి. లీకేజీలు కనిపిస్తే వాటిని రిపేర్ చేయించాలి. అలా చేయకుంటే బాయిలర్‌పై ఒత్తిడి పెరిగి గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు దానిపై ఓ కన్ను వేసి ఉంచాలి.
చాలామంది బాగా వేడి చేసిన గీజర్ నీళ్లతో తలస్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సలసలా కాగే నీళ్లతో తలస్నానం చేయకూడదు. అలాగే బాగా వేడి చేసిన నీటితో సాధారణ స్నానం కూడా చేయకూడదు. అలా చేస్తే చర్మం దాని సహజ నూనెలు కోల్పోతుంది. తద్వారా పగిలిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి:
Health Tips: చలికాలంలో తక్కువ నీళ్లు తాగుతున్నారా.. ఈ 5 లక్షణాలుంటే జాగ్రత్త..
Health: ఊహించని ప్రమాదంలో పడ్డ మహిళ! ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే..