Share News

Health News: లోబీపీ ఉన్నవారికి ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసా..

ABN , Publish Date - Dec 08 , 2024 | 07:32 AM

సాధారణ రక్తపోటు 120/80 mmHgగా ఉంటుంది. ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే హైబీపీగాను, 90/60 mmHg కంటే తక్కువగా లోబీపీ(హైపోటెన్షన్ ) గాను పిలుస్తారు. ఓ వ్యక్తి రక్తపోటు స్థాయి అనేది సాధారణ పరిమితుల కంటే తక్కువగా ఉన్నప్పుడు అతను హైపోటెన్షన్‌కు గురవుతాడు.

Health News: లోబీపీ ఉన్నవారికి ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసా..

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్య సమస్యలు అనేకం. మంచి ఆహారం, తగిన వ్యాయామం, మంచి జీవనశైలి అలవర్చుకున్నప్పటికీ కొంతమందిలో అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం డయాబెటిస్, బీపీ, క్యాన్సర్, గుండె, కిడ్నీ సమస్యలు బాగా పెరిగిపోయాయి. వీటి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా బీపీ సమస్య చాలామందిని వేధిస్తోంది. హైబీపీతో కొంతమంది ఇబ్బందులు పడుతుంటే, లోబీపీతో ఇంకొంతమంది నరకం చూస్తున్నారు. అయితే లోబీపీకి గల కారణాలు ఏంటి?, అది ఎందుకు వస్తుంది, దాని బారిన పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..


లోబీపీ వస్తే ఏం జరుగుతుంది..

సాధారణ రక్తపోటు 120/80 mmHgగా ఉంటుంది. ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే హైబీపీగాను, 90/60 mmHg కంటే తక్కువగా లోబీపీ(హైపోటెన్షన్ ) గాను పిలుస్తారు. ఓ వ్యక్తి రక్తపోటు స్థాయి అనేది సాధారణ పరిమితుల కంటే తక్కువగా ఉన్నప్పుడు అతను హైపోటెన్షన్‌కు గురవుతాడు. ప్రస్తుతం ఈ సమస్య చాలామందిలో కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇదో సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే దీని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. లోబీపీ సమస్యతో బాధపడుతున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. గుండె వేగం తగ్గడం, మగత, కళ్లు తిరగడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం చల్లగా మారిపోవడం, వాంతులు, వికారం, చెమటలు పట్టడం, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవటం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.


ఎందుకు వస్తుందంటే..

చాలామంది శరీరానికి సరిపడా నీటిని తాగరు. ప్రతి రోజూ నీరు తాగే విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. ఇలాంటి వారు డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని వల్ల రక్తపోటు తగ్గే ప్రమాదం ఉంది. అలాగే మంచి పోషక ఆహారం తీసుకోని వారు సైతం లోబీపీ బారినపడే అవకాశం ఉంటుంది. ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటివి శరీరంలో తక్కువగా ఉన్నవారు ముందుగా రక్తహీనత బారిన పడతారు. అది కాస్త లోబీపీకి దారితీస్తుంది. రోడ్డుప్రమాదాలకు గురైనవారిని సైతం లోబీపీ సమస్య వేధించే అవకాశం ఉంటుంది. ప్రమాదంలో అధిక రక్తస్రావం అయితే అది రక్తపోటుకు దారితీస్తుంది. దాని వల్ల హైపోటెన్షన్ సమస్య మెుదలవుతుంది. అలాగే అడ్రినల్ గ్రంధి సరిగ్గా పనిచేయని వారు థైరాయిడ్ బారిన పడతారు. అలాంటి వారిలోనూ లోబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆరోగ్యం కోసం కొంతమంది మాత్రలు వేసుకుంటుంటారు. కొన్ని రకాల మందులు రక్తపోటు తగ్గించే ప్రమాదం ఉంది.


లోబీపీ ఎలా తగ్గించాలంటే..

లోబీపీ సమస్య ఉన్నవారు శరీరానికి తగినంత నీరు అందించాలి. ఆ విషయంలో అశ్రద్ధ పనికి రాదు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో సోడియం స్థాయి తగినంత ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో కాస్త ఉప్పు ఎక్కువగా వేసి తింటే ఉపశమనం లభిస్తుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకేసారి అధికంగా తినకుండా, ఎక్కువసార్లు తక్కువగా తింటూ ఉండాలి. లోబీపీ వల్ల చర్మం చల్లగా మారిపోయినా లేదా అలసట అనిపించినా వెంటనే వేడివేడి కాఫీ తాగితే కాస్త రిలీఫ్ దొరుకుతుంది. పడుకునే సమయంలో కాళ్ల కింద దిండ్లు వంటివి పెట్టుకోవాలి. అలా కాళ్లను కొంచెం ఎత్తులో ఉంచడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచిది.

Updated Date - Dec 08 , 2024 | 07:32 AM