Share News

Health News: డేంజర్.. ఇలాంటి వారిలో ప్రాణహాని ముప్పు 10శాతం అధికం..

ABN , Publish Date - Oct 25 , 2024 | 07:28 AM

న్యూరోటిసిజం అనే సమస్యతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు కనపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావిస్తారని, చిన్నచిన్న వాటికి సైతం అతిగా స్పందిస్తారని పరిశోధనల్లో గుర్తించినట్లు చెబుతున్నారు.

Health News: డేంజర్.. ఇలాంటి వారిలో ప్రాణహాని ముప్పు 10శాతం అధికం..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనుషులు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సినిమాలు, సీరియల్స్ లేదా ఒటీటీ షోలు చూస్తుంటారు. కనీసం వారానికి ఒక్క సినిమా అయినా చూస్తుంటారు. రోజుకో సినిమా చొప్పున చూసే సినీ ప్రియులు కూడా ఉంటారు. కొంతమంది సినిమాలో వచ్చే సెంటిమెంట్ సీన్లకు ఏడుస్తుంటారు. అలాంటి వారిని చూసి స్నేహితులు కడుపుబ్బా నవ్వుకుంటారు. అయితే అలా సెంటిమెంట్ సీన్లకు రియాక్టయి ఏడ్చే వారికి అకాల మరణం ముప్పు ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వారికి ఆరోగ్యవంతులతో పోలిస్తే అకాల మరణం ముప్పు 10శాతం అధికంగా ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేల్చారు.


న్యూరోటిసిజం అనే సమస్యతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు కనపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావిస్తారని, చిన్నచిన్న వాటికి సైతం అతిగా స్పందిస్తారని పరిశోధనల్లో గుర్తించినట్లు చెబుతున్నారు. వీరిలో భయం, విచారం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఒంటరితనం, ఆందోళన, మానసిక కల్లోలం, విసుగు చెందడం, వివిధ రకాల భావోద్వేగాలతో నిత్యం బాధపడతారని వెల్లడించారు. ఇలాంటి లక్షణాలు వారి మనసు, శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వడమే మరణాల ముప్పు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.


అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో 5లక్షల మంది జీవితాలపై సుదీర్ఘం కాలంపాటు చేసిన అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకే బయోబ్యాంక్‌ డేటాలో 2006 -2010 మధ్య అధ్యయనం చేసిన పరిశోధకులు న్యూరోటిసిజం సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించారు. వారికి చెందిన 17సంవత్సరాల జీవితాన్ని పరిశోధించిన ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అకాల మరణాన్ని గుర్తించారు. డేటా బ్యాంకు అనేది ప్రజలకు చెందిన జన్యు, జీవనశైలి, బయోలాజికల్ శాంపిల్స్ వంటి అంశాలను భద్రపరుస్తుంది. దీని ద్వారా 17 సంవత్సరాలపాటు వారి జీవితాలను ట్రాక్ చేసి అకాల మరణాలను గుర్తించారు. ఈ పరిశోధనల్లో 5లక్షల మందిలో 43,400 మంది మృతిచెందినట్లు పరిశోధకుల బృందం కనిపెట్టింది.


న్యూరోటిసిజంతో మరణించిన వారిలో ఎక్కువమంది క్యాన్సర్‌, నాడీ వ్యవస్థ పని చేయకపోవడం, జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ వంటి సమస్యలతో మృతిచెందారని పరిశోధనా బృందంలోని ప్రొఫెసర్‌ ఆంటోనియో టెర్రాసియానో తెలిపారు. వీరంతా చనిపోవడానికి ముందు తప్పు చేశామనే భావన, ఆందోళన, ప్రశాంతత లేని జీవితం, మానసిక ఒత్తిడిని సంవత్సరాలపాటు అనుభవించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే న్యూరోటిసిజం సమస్య అనేది ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 54 ఏళ్ల లోపు వారిలో, అలాగే టీనేజర్స్‌లో ఈ సమస్య అధికమని గుర్తించినట్లు ప్రొఫెసర్ వెల్లడించారు. వీరిలో అకాల మరణం సమస్య 10శాతం అధికమని చెప్పుకొచ్చారు. ఎవరైనా న్యూరోటిసిజంతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రొఫెసర్ ఆంటోనియా సూచించారు.

Updated Date - Oct 25 , 2024 | 08:38 AM