Health Tips: మార్నింగ్ వాక్.. ఈవెనింగ్ వాక్‌లో ఏది మంచిదో తెలుసా..
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:05 PM
ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం అరగంటైనా నడకను మీ జీవితంలో భాగం చేసుకోవాలనేది నిపుణుల మాట. అలా అని రోజులో ఏ సమయంలోనైనా నడవచ్చు కదా అనుకుంటే పొరపాటే. మరి ఏ సమయంలో వాకింగ్ చేస్తే మంచిదనే డౌట్ రావచ్చు. రోజంతా ఉత్సాహంగా సాగేందుకు మార్నింగ్ వాక్ ఓ చక్కటి మార్గం. ఐతే, సాయంత్రాల్లో నడిస్తే ప్రయోజనాలుండవా అంటే ఉంటాయి. కానీ, ఆయా సమయాన్ని బట్టి నడక వల్ల కలిగే ప్రయోజనాలు మారుతుంటాయి.
అన్నింటికంటే అత్యంత సులువైన వ్యాయామం నడక ఒక్కటే. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. ఇందుకోసం జిమ్‌లో లాగా ప్రత్యేకంగా ఎక్విప్‌మెంట్ కూడా కొనాల్సిన పనిలేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా చేసేయొచ్చు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం అరగంటైనా నడకను మీ జీవితంలో భాగం చేసుకోవాలనేది నిపుణుల మాట. అలా అని రోజులో ఏ సమయంలోనైనా నడవచ్చు కదా అనుకుంటే పొరపాటే. మరి ఏ సమయంలో వాకింగ్ చేస్తే మంచిదనే డౌట్ రావచ్చు. సాధారణంగా ఉదయాన్నే వాకింగ్ చేయడమే సరైన సమయమనేది ఆరోగ్య నిపుణుల సలహా. ఈజీగా బరువు తగ్గేందుకు, రోజంతా ఉత్సాహంగా సాగేందుకు మార్నింగ్ వాక్ ఓ చక్కటి మార్గం. ఐతే, సాయంత్రాల్లో నడిస్తే ప్రయోజనాలుండవా అంటే ఉంటాయి. కానీ, ఆయా సమయాన్ని బట్టి నడక వల్ల కలిగే ప్రయోజనాలు మారుతుంటాయి.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున లేవగానే ఫోన్‌లు, ఇంటి పనుల్లో మునిగిపోయేవారు కొందరైతే, ఉద్యోగరీత్యా ఉదయాన్నే నిద్రలేవలేక పోయేవారు ఇంకొందరు. వాకింగ్‌ను దినచర్యలో భాగం చేసుకుంటే మంచిదని తెలిసిన సమయం కేటాయించటంలో విఫలమవుతున్నారు. ఇదొక్కటే కాక చిన్న దూరాలకు బైక్‌లు, కార్లలో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తూ నడకకు దూరమవుతున్నరు. దీంతో ఫిట్‌నెస్ కోల్పోయి తరచూ మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇలా రకరకాల కారణాలు, జీవనశైలి మార్పుల వల్ల నడక వల్ల కలిగే ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు.
ఉదయాన్నే వాకింగ్ చేస్తే..
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు అధికంగా ఖర్చయ్యి శరీరం తేలికపడుతుంది. లేలేత సూర్యకిరణాలు, చల్లటి తాజా గాలి వల్ల మనసు రిఫ్రెష్ అయ్యి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సూర్యకాంతి నుంచి లభించే విటమిన్ డి వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు దూరమవుతాయి. అధిక బరువు, మధుమేహం, జీర్ణక్రియ తదితర సమస్యలు ఎన్నో అదుపులోకి వస్తాయి. మానసికంగా, శారీరకంగా బలపడేందుకు ఉదయపు నడక ఎంతో సాయపడుతుంది.
సాయంత్రం నడిస్తే..
ఒత్తిడిని తగ్గించి మనసును, శరీరాన్ని చైతన్యపరిచేందుకు సాయంత్రపు నడక అత్యుత్తమ మార్గం. క్రమం తప్పకుండా ఈవెనింగ్ వాక్ చేసేవారికి నిద్రలేమి సమస్యలు తొలగి చక్కని నిద్ర పడుతుంది. విశ్రాంతి భావనను కలిగించి మీలో నూతనోత్సాహం నింపుతుంది.
మార్నింగ్ వాక్ vs ఈవినింగ్ వాక్:
బరువు నియంత్రించుకునేందుకు, గుండె ఆరోగ్యం కాపాడుకునేందుకు ఉదయం, సాయంత్రం ఏ వేళల్లో నడిచినా ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఉదయం నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వ్యక్తుల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మార్నింగ్ వాక్ ఎంచుకోవటమే మేలు. ఉదయం కనీసం 15 నిమిషాలు నడిచినా లెక్కలేనన్ని ఉపయోగాలు. ఇక, సాయంత్రం నడక మెరుగైన జీర్ణక్రియకు, భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయులను నియంత్రించేందుకు సహకరిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకుని విశ్రాంతి పొందాలని కోరుకునేవారికి పగటి పూట కంటే సాయంత్రం నడకే అనువైనది. ప్రతిరోజూ ఒకే సమయంలో చేయడం వీలు కాదనుకునేవారు రెండింటిలో ఏదొక సమయం ఎంచుకునేందుకు ప్రయత్నించండి. ఈ రెండు సమయాల్లో కుదరదనుకునేవారు పరిస్థితులను బట్టి రోజు మొత్తం మీద అరగంట నడక అలవాటు చేసుకుంటే ఉపయోగకరం.