Share News

McDonald's: మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లతో కొత్త రోగం.. జాగ్రత్త..

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:11 PM

ఈ-కోలి వ్యాధి 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించినట్లు సీడీసీ అధికారులు చెప్తున్నారు. పది రాష్ట్రాల్లో కలిసి మెుత్తం 49 కేసులు నమోదు అయ్యాయని, వీటిలో ఎక్కువ భాగం కొలరాడో, నెబ్రాస్కాలో నమోదు అయ్యాయని ఆరోగ్య సంస్థ తెలిపింది.

McDonald's: మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లతో కొత్త రోగం.. జాగ్రత్త..

వాషింగ్టన్: అమెరికా దేశంలో మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లు తిని ఒకరు మృతిచెందగా డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రమైన ఈ-కోలి వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఇవాళ (మంగళవారం) తెలిపింది. మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లు తినడం వల్ల చాలా మంది హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు సీడీసీ అధికారులు గుర్తించారు. ఈ వ్యాధి వచ్చిన వారు తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం ప్రస్తుతం అమెరికా ప్రజలను వణికిస్తోంది.


ఈ-కోలి వ్యాధి 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించినట్లు సీడీసీ అధికారులు చెప్తున్నారు. పది రాష్ట్రాల్లో కలిసి మెుత్తం 49 కేసులు నమోదు అయ్యాయని, వీటిలో ఎక్కువ భాగం కొలరాడో, నెబ్రాస్కాలో నమోదు అయ్యాయని ఆరోగ్య సంస్థ తెలిపింది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందగా పది మందికి పైగానే ఆస్పత్రి పాలయ్యారని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కేసులు మెుదలైనట్లు సంస్థ వెల్లడించింది. స్లివర్డ్ ఉల్లిపాయలు, గొడ్డు మాంసం వల్లే హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌ వస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి వస్తే వాంతులు, జ్వరం, విరేచనాలతోపాటు కిడ్నీలోని రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అందుకే క్వార్టర్ పౌండర్‌లతో కూడిన హాంబర్గర్‌లు తినొద్దని చెప్తున్నారు.


వ్యాప్తికి కారణమయ్యే కచ్చితమైన పదార్థాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, వారు సిల్వర్డ్ ఉల్లిపాయలు, గొడ్డు మాంసంపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరీక్షిస్తున్నారు. వీటిని వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్ల నుంచి తీసివేశారు. అయితే ఘటనపై మెక్‌డొనాల్డ్ యూఎస్ఏ ఛైర్మన్ జో ఎర్లింగర్ స్పందించారు. తనకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో క్వార్టర్ పౌండర్స్‌లో స్లివర్డ్ ఉల్లిపాయల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.


అయితే క్వార్టర్ పౌండర్‌ హాంబర్గర్‌లు తిని ఈ-కోలి వ్యాధి సోకితే విరేచనాలు, 102 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. క్వార్టర్స్ పౌండర్ తిన్న తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయని వైద్యులు చెప్తున్నారు. అయితే చాలా మంది వ్యక్తులు చికిత్స లేకుండా ఐదు నుంచి ఏడు రోజులలోపు కోలుకుంటారని తెలిపారు. కొన్ని కేసుల విషయంలో పరిస్థితి తీవ్రంగా మారి ఆస్పత్రిలో చేరాల్సి రావొచ్చని చెబుతున్నారు. లక్షణాలు గుర్తించలేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 01:11 PM