Russia: భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:47 AM
ఉక్రెయిన్‌పై రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా.. శాంతి చర్చల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించగలదని అభిప్రాయపడింది.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధినేత పుతిన్
చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటన
మాస్కో, సెప్టెంబరు 5: ఉక్రెయిన్‌పై రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా.. శాంతి చర్చల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించగలదని అభిప్రాయపడింది. భారత్‌తోపాటు.. బ్రెజిల్, చైనాల వల్ల మధ్యవర్తిత్వం సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ మేరకు రష్యా అధినేత పుతిన్ వ్లాదివాస్తోక్‌లో జరుగుతున్న తూర్పు ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘యుద్ధం మొదలైన తొలి వారం తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్ అమలు చేయలేదు. నిజానికి ఆ ఒప్పందంతో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి సంతృప్తి వ్యక్తం చేశాకే.. సంతకం చేశారు.
అయితే.. అమెరికా, ఐరోపా ఒత్తిడి కారణంగా ఉక్రెయిన్ ఆ ఒప్పందాన్ని అమలు చేయడం లేదు. ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్ చర్చలుంటాయి. ఉక్రెయిన్‌తో చర్చలకు మేం సిద్ధంగానే ఉన్నాం. అయితే.. అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా చర్చలు జరపలేం’’ అని పుతిన్ వివరించారు. క్రెమ్లిన్‌లో పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ‘‘శాంతి ప్రక్రియలో భారత్ కీలకం. భారత ప్రధాని మోదీ-పుతిన్ మధ్య నిర్మాణాత్మక, స్నేహపూర్వక సంబంధాలున్నాయి. మోదీకి రష్యా, ఉక్రెయిన్, అ మెరికాతో సంబంధాలున్నాయి.
భారత్ వల్ల శాంతి చర్చలు సాధ్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికలపై పెస్కోవ్ మాట్లాడుతూ ట్రంప్‌తో పోలిస్తే కమలాహ్యారి్‌సను అంచనావేయడం తేలికని పేర్కొన్నారు. పుతిన్ కూడా అమెరికా ఎన్నికల్లో కమలాహ్యారిస్‌కు మద్దతిస్తానని ప్రకటించారు. కాగా.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకకపోవడంతో.. ఇరువైపులా ప్రాణ, ఆస్తినష్టం జరుగుతూనే ఉంది. అయితే.. ఇదివరకే భారత ప్రధాని మోదీ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యి.. చర్చలే శాంతికి మార్గమని సూచించిన విషయం తెలిసిందే..!