Share News

Federal Criminal Court: మోదీ ప్రభుత్వం, సెబీ లాగా కళ్లు మూసుకోం..

ABN , Publish Date - Sep 21 , 2024 | 05:16 AM

స్విట్జర్లాండ్‌లో అదానీ గ్రూప్‌ పప్పులు ఉడికేలా లేవు. ఈ నెల 12న తమ ఫెడరల్‌ క్రిమినల్‌ కోర్టు స్తంభింప చేసిన 31 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,589 కోట్లు) బ్యాంకు ఖాతాల్లోని నిధులు ఏ భారత పారిశ్రామికవేత్తవి?

Federal Criminal Court: మోదీ ప్రభుత్వం, సెబీ లాగా కళ్లు మూసుకోం..

  • అక్రమార్కులు తప్పించుకోలేరన్నస్విట్జర్లాండ్‌ అటార్నీ ఆఫీసు

  • స్విస్‌ ఖాతాల వ్యవహారంలో అదానీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బెర్న్‌ (స్విట్జర్లాండ్‌): స్విట్జర్లాండ్‌లో అదానీ గ్రూప్‌ పప్పులు ఉడికేలా లేవు. ఈ నెల 12న తమ ఫెడరల్‌ క్రిమినల్‌ కోర్టు స్తంభింప చేసిన 31 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,589 కోట్లు) బ్యాంకు ఖాతాల్లోని నిధులు ఏ భారత పారిశ్రామికవేత్తవి? ఈ ఖాతాల్లోకి ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాలపై స్విస్‌ అటార్నీ జనరల్‌ ఆఫీ్‌స(ఓఏజీ) దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ దర్యాప్తు వివరాలను వెల్లడించేందుకు ఓఏజీ నిరాకరిస్తోంది. కనీసం ఈ ఖాతాల వెనక ఎవరున్నారనే విషయం చూచాయగా వెల్లడించేందుకు కూడా ఇష్టపడడం లేదు.


అయితే తమ దర్యాప్తు నరేంద్ర మోదీ ప్రభుత్వం, మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చేపట్టినట్టుగా తూతూమంత్రంగా ఉండదని, నిజాల నిగ్గు తేల్చి అక్రమార్కుల భరతం పట్టేలా ఉంటుందని ఓఏజీ అధికార వర్గాలు తెగేసి చెబుతున్నాయి. అసలు దోషులెవరో తేల్చాక, తమ చట్టాల ప్రకారం వారిపై భారీ జరిమానాలతో పాటు జైలు తప్పదని స్పష్టం చేశారు. నిజానికి ఈ ఖాతాలు స్తంభింపచేసినప్పుడే స్విస్‌ మీడియా ఈ ఖాతాల అసలు మాయగాళ్లు ఎవరో స్పష్టమైన సంకేతాలే ఇచ్చింది. అదానీ సోదరుల్లో ఒకరైన వినోద్‌ అదానీ ఈ రహస్య ఖాతాల నిధులతో భారత్‌లోని అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల దందా నడిపిస్తున్నట్టు హిండెన్‌బర్గ్‌ గతేడాదే బయటపెట్టింది. అయితే దీనికి ఆధారాల్లేవని సెబీ.. సుప్రీంకు తెలపడంతో అదానీలు బయట పడ్డారు.


  • ఆ వివరాలూ చెప్పం: సెబీ

మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌ పాత్రపై అనుమానాలు తొలగడం లేదు. ఆమె ఏ ఏ కంపెనీల ఫైల్స్‌ తన పరిశీలనకు వచ్చినప్పుడు ఆమె ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారనే వివరాలు వెల్లడించేందుకు సెబీ నిరాకరిస్తోంది. ఆర్‌టీఐ కింద లోకేశ్‌ బాత్రా అనే ఒక మాజీ సైన్యాధికారి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సెబీ నిరాకరించింది. తన, తన కుటుంబ సభ్యుల ఆర్థిక ఆస్తుల వివరాలు ఆమె సెబీకి ఎప్పుడు వెల్లడించారు? అందుకు సంబంధించిన పత్రాల కాపీలు ఇచ్చేందుకు కూడా సెబీ అంగీకరించడం లేదు.

Updated Date - Sep 21 , 2024 | 05:16 AM