DMK Leader remarks: 100 శాతం ఏకీభవించం... డీఎంకే రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్
ABN , Publish Date - Mar 05 , 2024 | 05:59 PM
ఇండియా ఒక దేశం కాదని, ఇదొక ఉప ఖండమని డీఎంకే సీనియర్ నేత ఎ.రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో 100 శాతం ఏకీభవించమని తెలిపింది. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికింది.
న్యూఢిల్లీ: ఇండియా ఒక దేశం కాదని, ఇదొక ఉప ఖండమని డీఎంకే (DMK) సీనియర్ నేత ఎ.రాజా (A.Raja) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో 100 శాతం ఏకీభవించమని తెలిపింది. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికింది.
మధురైలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఒక దేశం కాదని, దేశం అంటే ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం ఉండాలన్నారు. ఇండియా దేశం కాదని, ఉపఖండమని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, కశ్మీర్, మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో పలు భాషలు, సంస్కృతులు ఉన్నాయన్నారు. రాముడే దేవుడు, జై శ్రీరాం, భారత్ మాతాకీజై అని చెబితే తమిళనాడు ఎన్నటికీ అంగీకరించదని అన్నారు. తాను రామాయణాన్ని నమ్మనని కూడా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ నిన్న పిలుపునిస్తే, ఈరోజు భారత్‌ను బాల్కనైజేషన్ చేయాలని రాజీ పిలుపునిచ్చారని మండిపడింది. శ్రీరాముునిపై అవమానకర వ్యాఖ్యలా అని నిలదీసింది.
రాజా వ్యాఖ్యలను సమర్ధించం: సుప్రియ శ్రినతే
కాగా, తమిళనాడులోనే కాకుండా, ఇండియా (I.N.D.I.A.) కూటమిలో డీఎంకేతో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎ.రాజా వ్యాఖ్యలను ఖండించింది. రాజా వ్యాఖ్యలతో తాము నూటికి నూర శాతం ఏకీభవించమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రినతే మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాముడు అందరివాడని అన్నారు. "మేము రాముడిని నమ్ముతాం. ఆయన కులాలకు, మతాలకు అతీతం. ఆదర్శ జీవనానికి రాముడు ప్రతీక. రాముడు అంటే మర్యాద, రాముడు అంటే నీతి, రాముడంటే ప్రేమ. రాజా ప్రకటనను మేము సమర్ధించం. ఖండిస్తున్నాం. ఎవరైనా సరే పబ్లిక్‌లో మాట్లాడుతున్నప్పుడు సంయమనం పాటించాల్సి ఉంటుంది'' అని సుప్రియ శ్రినతే అన్నారు.