Lok Sabha Elections: తొలిసారి ఓటు వేయనున్న 1.8 కోట్ల మంది
ABN , Publish Date - Mar 16 , 2024 | 03:40 PM
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారంనాడు ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో 1.8 కోట్ల మంది తొలిసారి ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections-2024) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) శనివారంనాడు ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో 1.8 కోట్ల మంది తొలిసారి ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దివ్వాంగులు 88.4 లక్షల మంది, 85 ఏళ్లు పైబడిన వారు 82 లక్షల మంది, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 48,000 మంది, 100 ఏళ్లు పైబడిన వారు 2.18 కోట్ల మంది, యువ ఓటర్లు 19.74 కోట్ల మంది (20-29 ఏళ్ల లోపు) ఉన్నారు.
కాగా, ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 16వ తేదీతో ముగియనుండగా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల గడవు జూన్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నాలుగు అసెంబ్లీలకు ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ తాజా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.