Jammu and Kashmir: ఎన్‍కౌంటర్‍లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:27 PM
జమ్మూ కశ్మీర్‍లోని కుల్గాం జిల్లాలో ఎన్‍కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీనగర్, డిసెంబర్ 18: జమ్మూ కశ్మీర్‍లో జరిగిన ఎన్‍కౌంటర్‍లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కుల్గాం జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బెహిబాగ్ ప్రాంతంలోని కద్దార్ లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘాలు వర్గాలు బుధవారం రాత్రి సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున భద్రతా దళాలకు చెందిన సైనికులతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టారు. దీంతో భద్రతా దళాలతోపాటు పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. దీంతో భద్రతా దళాలు సైతం స్పందించి.. ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపులా భీకరంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులను భద్రతా దళాలతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు తిప్పికొట్టారని ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు తమ ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు.
Also Read: అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు.. దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ
మరోవైపు డిసెంబర్ మాసం ప్రారంభంలోనే జమ్మూ కశ్మీర్ లోని దాచిగ్రామ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ ను భద్రతా దళాలు కాల్చి చంపాయి. అతడు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి అని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అతడు.. గగన్ గిర్, గందర్ బల్ తదితర ప్రాంతాల్లోని పౌరులే లక్ష్యంగా చేసుకొని హతమారుస్తున్నాడని తెలిపారు.
Also Read: అమిత్ షాపై హీరో విజయ్ ఫైర్
Also Read: ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ.. కీలక నిర్ణయం
ఇంకోవైపు.. ఈ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదుల దాడుల ఘటనలు పెచ్చురిల్లుతోన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రత దళానికి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను జమ్మూలో ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. అయితే ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలోని మొత్తం 10 జిల్లాల్లో 8 జిల్లాల్లో ఉగ్రవాదుల దాడులు గణనీయంగా పెరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 44 మంది మృతి చెందారు. వారిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. 14 మంది పౌరులు, 13 మంది ఉగ్రవాదులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
For National news And Telugu News