Delhi: మోదీ, రాహుల్ ఒకేచోట.. ఆప్యాయపు పలకరింపు
ABN , Publish Date - Aug 09 , 2024 | 08:15 PM
లోక్ సభ సమావేశాలు వాయిదా పడ్డాక శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉన్న ప్రధాని మోదీ, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఒకే చోట చేరారు. చేరడమేకాదు ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకున్నారు.
ఢిల్లీ: లోక్ సభ సమావేశాలు వాయిదా పడ్డాక శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉన్న ప్రధాని మోదీ, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఒకే చోట చేరారు. చేరడమేకాదు ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకున్నారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని టీ సమావేశం ఈ అద్భుత దృశ్యానికి వేదికైంది. ప్రధాని సోఫాలో కూర్చుండగా.. ఆయన పక్కనే స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి కుడివైపున కుర్చీపై కూర్చున్నారు. మంత్రులు కిరణ్ రిజిజు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, పీయూష్ గోయల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమొళి కూడా రాహుల్ గాంధీ ఉన్న వరుసలో కూర్చున్నారు.
అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు రాహుల్‌కు ఎదురుగా కూర్చున్నారు. వారంతా తమలో తాము మాట్లాడుకుంటున్న సమయంలో ఓ సర్వర్ టీ ట్రేతో ఎంట్రీ అయ్యారు. కొన్ని వారాల క్రితం లోక్‌సభలో మోదీ, రాహుల్ గాంధీ మధ్య పదునైన మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. నిత్యం వాడీవేడీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే నేతలు ఇరువురు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. కాగా.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.
రాజ్యసభలో వాగ్వాదం..
కాగా.. శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదు’’ అని జయాబచ్చన్ అనడం వాగ్వాదానికి దారితీసింది. "సర్ నా పేరు జయ అమితాబ్ బచ్చన్. నేనొక నటినని మీతో చెప్పాలనుకుంటున్నాను. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌ను నేను అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి.. మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదు. మనం సహచరులం. మీరు స్పీకర్ స్థానంలో కూర్చొని ఉండవచ్చు’’ అని జయాబచ్చన్ వ్యాఖ్యానించారు. జయా బచ్చన్ మైక్ కట్ చేసిన ధన్‌ఖడ్ ఆమెపై అసహనం వ్యక్తం చేసి చేతులతో సైగలు చేసి కూర్చోవాలని సూచించారు. ‘‘నాకు మీరు పాఠాలు చెప్పొద్దు!’’ అని అన్నారు. ‘‘ మీరు ఒక నటి. మీరు సెలబ్రిటీ అయితే కావొచ్చు. కానీ మర్యాదగా మెలగాలి’’ అని సమాధానం ఇచ్చారు.