Actor Fraud: సినీ నటుడి నెత్తిన టోకరా.. ఒక్క ‘క్లిక్’తో తలక్రిందులు
ABN , Publish Date - Jun 12 , 2024 | 07:35 AM
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఓ నటుడికి ఇటీవల ఓ అనూహ్య అనుభవం ఎదురైంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఓ నటుడికి ఇటీవల ఓ అనూహ్య అనుభవం ఎదురైంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన పసిగట్టి బ్యాంక్ మేనేజర్‌ను అప్రమత్తం చేశాడు. అయినప్పటికీ.. ఆయన బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
మహ్మద్ ఇక్బాల్ (Mohammed Iqbal) అలియాస్ ఇక్బాల్ ఆజాద్ (59) అనే ఓ నటుడు ముంబైలోని దాదర్‌లో నివాసముంటున్నాడు. తనకు కీళ్లనొప్పులు ఉండటంతో.. ఆర్థోపెడిక్ వైద్యుల ఫోన్ నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడు. ఈ క్రమంలోనే తనకు ఓ నంబర్ దొరకడంతో.. దానికి కాల్ చేశాడు. అవతల మాట్లాడిన వ్యక్తి.. డాక్టర్‌తో మాట్లాడే ముందు రూ.10 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించాడు. ఆ నటుడి ఫోన్‌కి రెండుసార్లు ఒక లింక్‌ని పంపించాడు. ఆజాద్ ఆ లింక్‌ని క్లిక్ చేయగా.. అది సరిగ్గా స్పందించలేదు. దీంతో తనకు ఏదో తేడా కొడుతోందన్న అనుమానం వచ్చింది. అప్పుడు వెంటనే తన బ్యాంక్ మేనేజర్‌ను ఆయన అప్రమత్తం చేశాడు.
కట్ చేస్తే.. నాలుగు రోజుల తర్వాత ఆజాద్ ఫోన్‌కు వరుసగా నాలుగు మెసేజ్‌లు వచ్చాయి. బ్యాంకు ఖాతా నుంచి రూ.77 వేలు విత్‌డ్రా చేయబడ్డాయని ఆ మెసేజ్‌లలో పేర్కొని ఉంది. తాను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండానే అంత డబ్బు ఎలా పోయిందంటూ ఖంగుతిన్న ఆజాద్.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు.. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో.. వాట్సాప్‌కు వచ్చే ఇలాంటి లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ నటుడితో పాటు పోలీసులు హెచ్చరించారు.
Read Latest National News and Telugu News