Share News

Adani : 7200 కోట్లు కట్టండి

ABN , Publish Date - Nov 04 , 2024 | 02:31 AM

ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని ఝార్ఖండ్‌లోని అదానీ పవర్‌ కంపెనీ హెచ్చరించింది.

Adani : 7200 కోట్లు కట్టండి

  • ఈ నెల 7లోగా చెల్లించకపోతే విద్యుత్తు ఆపేస్తాం

  • బంగ్లాదేశ్‌కు అదానీ పవర్‌ కంపెనీ హెచ్చరిక

  • కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలు

  • అక్టోబరు ఆఖరు నుంచి కరెంటు సరఫరా తగ్గింపు

  • భారత మార్కెట్లో ఆర్డర్ల కోసం ప్రయత్నాలు

న్యూఢిల్లీ, నవంబరు 3: ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని ఝార్ఖండ్‌లోని అదానీ పవర్‌ కంపెనీ హెచ్చరించింది. కరెంటు సరఫరాకు సంబంధించిన బకాయిలు 85 కోట్ల డాలర్ల (రూ.7,200 కోట్లు) మేర పెరిగిపోయాయని తెలిపింది. వాస్తవానికి, అక్టోబరు 31వ తేదీలోపే బకాయిలు చెల్లించాలని, లేదంటే, రూ.1500 కోట్లకు ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ (ఎల్‌సీ) ఇవ్వాలని బంగ్లాదేశ్‌ విద్యుత్‌ బోర్డుకు అదానీ కంపెనీ గతంలోనే తెలిపింది. ఈ మేరకు ఎల్‌సీ ఇవ్వటానికి బోర్డు అంగీకరించినప్పటికీ, అది విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం మేరకు లేదని సమాచారం. దీంతో 31వ తేదీ నుంచి అదానీ పవర్‌ కంపెనీ బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్న కరెంటును తగ్గించింది. ఝార్ఖండ్‌ గొడ్డాలోని అదానీ పవర్‌ కంపెనీ మొత్తం సామర్థ్యం 1496 మెగావాట్లు. బంగ్లాదేశ్‌లో మరో 3 కంపెనీలు (వీటిలో ఒకటి భారత్‌ ఎన్టీపీసీతో కలిసి ఏర్పాటు చేసిన రాంపాల్‌ యూనిట్‌) విద్యుదుత్పత్తి జరుపుతున్నప్పటికీ.. అదానీ కంపెనీయే అతిపెద్ద సరఫరాదారుగా ఉంటోంది. అదానీ పవర్‌ కంపెనీకి బంగ్లాదేశే అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. అయితే, షేక్‌ హసీనా పదవీచ్యుతితో బంగ్లాదేశ్‌లో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, ప్రభుత్వం అదానీ కంపెనీకి బకాయిలు చెల్లించడం లేదు.

Updated Date - Nov 04 , 2024 | 02:31 AM