Bharat Jodo Nyay Yatra: డీల్ కుదిరితేనే రాహుల్ యాత్రలో అఖిలేష్ ఎంట్రీ
ABN , Publish Date - Feb 18 , 2024 | 09:20 PM
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ లో అడుగుపెడుతున్న వేళ సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ యాత్రలో పాల్గొంటారా అనే సస్పెన్స్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఖరారైతేనే యాత్రలో పాల్గొనాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం.
లక్నో: రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో అడుగుపెడుతున్న వేళ సమాజ్‌వాద్ పార్టీ (Samjawadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్ (AkhileshYadav) ఈ యాత్రలో పాల్గొంటారా అనే సస్పెన్స్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఖరారైతేనే యాత్రలో పాల్గొనాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం. యాత్రలో పాల్గొనడానికి ముందే సీట్ల షేరింగ్‌పై నిర్ణయం జరిగిపోవాలని ఎస్‌పీ పట్టుదలగా ఉందని చెబుతున్నారు. ఇది తేలేంతవరకూ రాహుల్ గాంధీ ప్రోగ్రాంలో పాల్గొనే విషయంలో సంయమనం పాటించాలని కార్యకర్తలకు ఆ పార్టీ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ యాత్ర ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం అమేథీ చేరుకుంటుంది. ఫిబ్రవరి 20న రాయబరేలి వెళ్తుంది.
ఎస్పీకి కాంగ్రెస్ ఆహ్వానం
న్యాయ్ యాత్రలో పాల్గొనాలంటూ కాంగ్రెస్ చేసిన ఆహ్వానాన్ని అంగీకరించినట్టు అఖిలేష్ యాదవ్ అంతకుముందు చెప్పారు. అమేథీలో కానీ, రాయబరేలిలో కానీ కలుసుకుంటామన్నారు. అయితే అఖిలేష్ షెడ్యూల్ మాత్రం ఇంతవరకూ ఖరారు కాలేదు. తగిన ఏర్పాటు చేయాల్సిందిగా అమేది, రాయబరేలి సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 16 సీట్లు ఇవ్వడానికి ఎస్పీ సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ 21 నుంచి 22 సీట్లు డిమాండ్ చేస్తోంది. దీనికితోడు కొన్ని ముస్లిం మైనారిటీ సీట్లలో పోటీ చేసే విషయంలో ఇటు కాంగ్రెస్, అటు సమాజ్‌వాదీ పార్టీ గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించి సోమవారం మధ్యాహ్నానికల్లా ఒక స్పష్టత రావచ్చని సమాజ్‌వాదీ పార్టీ ఆశాభావంతో ఉంది.