Share News

INDIA bloc: 11 సీట్ల ఫార్ములా ప్రకటించిన ఎస్పీ, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్

ABN , Publish Date - Jan 27 , 2024 | 05:29 PM

బీహార్‌ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

INDIA bloc: 11 సీట్ల ఫార్ములా ప్రకటించిన ఎస్పీ, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్

లక్నో: బీహార్‌ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ప్రకటించారు. ''కాంగ్రెస్‌తో మా స్నేహపూర్వక కూటమి 11 బలమైన సీట్లతో శుభారంభమైంది. గెలుపు ఈక్వేషన్లతో ఈ ట్రెండ్ ముందుకు సాగుతుంది. ఇండియా కూటమి, పీడీఏ వ్యూహం చరిత్రను మారుస్తుంది'' అని అఖిలేష్ ట్వీట్ చేశారు.


కాంగ్రెస్ స్పందన..

అఖిలేష్ ట్వీట్ వెలువడిన కొద్దిసేపటికే కాంగ్రెస్ స్పందించింది. డీల్ ఇంకా కుదరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి అఖిలేష్ యాదవ్, అశోక్ గెహ్లాట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వారు కలుసుకుంటారని, చర్చలు ముగిసిన తర్వాతే ఫార్ములా (సీట్ల షేరింగ్) ఏమిటనేది చెప్పగలమని ఆయన అన్నారు. కాగా, తనకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు. సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, రాష్ట్రీయ లోక్‌ దళ్ (RLD)తో ఇప్పటికే సీట్ల పంపకాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఖరారు చేసింది. ఆ ప్రకారం ఆర్ఎల్‌డీ 7 సీట్లలో పోటీ చేయనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 5 సీట్లు, కాంగ్రెస్-2, ఆర్ఎల్‌డీ ఒక సీటు గెలుచుకున్నాయి.


కాగా, పశ్చిమబెంగాల్‌లో 'ఇండియా' కూటమితో పొత్తు లేదని మమతాబెనర్జీ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి పలు ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ వాటిని నిర్ద్వంద్వంగా ఆ పార్టీ తోసిపుచ్చినందున టీఎంసీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని ఆమె తెలిపారు. మరోవైపు, పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని 'ఆప్' ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇటీవల తెలిపారు.

Updated Date - Jan 27 , 2024 | 05:40 PM