Amit Shah : పాతాళానికి తొక్కేస్తాం
ABN , Publish Date - Sep 17 , 2024 | 03:23 AM
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తామని, మళ్లీ అది పైకి లేవకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదం మళ్లీ పైకి లేవదు: అమిత్ షా
గులాబ్‌గఢ్, సెప్టెంబరు 16: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తామని, మళ్లీ అది పైకి లేవకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇక ఆర్టికల్ 370 అనేది చరిత్ర అన్నారు. భారత రాజ్యాంగంలో ఎన్నడూ భాగం కాబోదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీరులోని కిష్ట్వార్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోమవారం అమిత్ షా మాట్లాడారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మూడు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రె్‌స కూటమి జమ్మూకశ్మీరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. 1990లో పేట్రేగిన ఉగ్రవాదం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఇకపై అలాంటి పరిస్థితి ఉత్పన్నం కానివ్వబోమని ప్రజలకు హామీ ఇచ్చారు.
కశ్మీరు గడ్డపైకి మళ్లీ పైకి లేవనంత లోతుకు ఉగ్రవాదాన్ని పాతిపెడతామన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదల చేస్తామని హామీలు ఇస్తోందని అమిత్ షా విమర్శించారు. ‘‘అమ్మవారి గుడి ముందు నిల్చొని హామీ ఇస్తున్నా. ఇది మోదీ సర్కారు. భారత గడ్డపై ఉగ్రవాదాన్ని విస్తరించాలని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు’’ అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీరులో గ్రామస్థాయిలో భద్రతా దళాలకు ఆధునిక ఆయుధాలను సమకూర్చి, భద్రతను పటిష్ఠం చేసిందని చెప్పారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెబుతోందని.. దాన్ని పునరుద్ధరించడం అవసరమా? అని ప్రశ్నించారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతారని తెలిపారు. కానీ, ప్రజలు ఎవరూ భయపడొద్దని, ఆ కూటమి అధికారంలోకి రాదని చెప్పారు.