Share News

Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

ABN , Publish Date - Sep 14 , 2024 | 02:57 PM

కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్‌కీన్స్‌ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు ..

Nirmala Sitharaman:  క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..
Nirmala Sitharaman

తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో పాటు తమిళనాడుకు చెందిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం డీఎంకే సైతం ఈ వీడియోపై బీజేపీని టార్గెట్ చేశాయి. నిర్మలా సీతారామన్ భయపెట్టి క్షమాపణలు చెప్పించుకున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ హోటల్ యజమానితో క్షమాపణలు చెప్పించుకోవడం సిగ్గుచేటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ సైతం కాంగ్రెస్, డీఎంకేకు కౌంటర్ ఇస్తోంది. శ్రీనివాసన్ స్వచ్చందంగా తనకు తానుగా క్షమాపణలు చెప్పారని.. దీనివెనుక ఎలాంటి ఒత్తిడి లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా నిర్మలాసీతారమన్‌కు హోటల్ యజమాని క్షమాపణలు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. అసలు హోటల్ యజమాని శ్రీనివాసన్ నిర్మలాసీతారమన్‌ను ఎందుకు కలిశారు.. ఆమెకు ఎందుకు క్షమాపణ చెప్పారనే చర్చ జరగుతోంది.


జీఎస్టీపై ప్రశ్నిస్తూ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కోవైలో సెప్టెంబర్ 12న జీఎస్టీపై సందేహాల నివృత్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అన్నపూర్ణ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ ఈ సమావేశంలో కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్‌కీన్స్‌ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు జీఎస్టీ లేకపోయినా క్రీమ్‌ బన్నుకు 18శాతం జీఎస్టీ విధిస్తుండటంతో కొనుగోలుదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని.. రకరకాల జీఎస్టీలతో ఒకోసారి బిల్లు వేసే కంప్యూటర్ తికమకపడుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రశ్నలకు నిర్మలా సీతారమన్ సమాధానం చెప్పారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది. సమావేశం ముగిసిన తర్వాత శ్రీనివాసన్ నిర్మలా సీతారమన్‌ను కలిసి క్షమాపణలు చెప్పారు. ఓ గదిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఉండగా అన్నపూర్ణ హోటల్స్ ఎండీ శ్రీనివాసన్ ఉన్నారు. శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియోను తమిళనాడు బీజేపీ కన్వీనర్ బాలాజీ ఎంఎస్ షేర్ చేశారు. అసభ్యకరమైన ప్రసంగానికి శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పారన్న వ్యాఖ్యాన్ని వీడియోతో షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్, డీఎంకే సహా విపక్షాలు బీజేపీని టార్గెట్ చేశాయి. శ్రీనివాసన్‌ను బెదిరించి క్షమాపణలు చెప్పించుకున్నారని ఆరోపించారు. ఓ వ్యక్తి పట్ల బీజేపీ అగౌరవంగా వ్యవహరించిందని, ఆ పార్టీ అహంకారానికి ఇది నిదర్శమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు.


అన్నామలై క్షమాపణలు..

ఓ ప్రయివేట్ సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు రావడంపై బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షులు అన్నామలై ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు. బిజెపి తమిళనాడు శాఖ తరపున గౌరవనీయులైన హోటల్స్ యజమాని శ్రీనివాసన్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రయివేట్ సంభాషణను మా కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై శ్రీనివాసన్‌తో నేరుగా మాట్లాడానని.. ఈ వీడియో బయటకు రావడం పట్ల చింతిస్తు్నట్లు తెలిపానన్నారు. ఓ వ్యాపారవేత్తగా శ్రీనివాసన్ దేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందిస్తున్నారని ప్రశంసించారు. అయితే నిర్మలా సీతారమన్‌కు క్షమాపణలు చెప్పడంపై శ్రీనివాసన్ స్పందించలేదు. బలవంతంగా చెప్పించారా.. లేదంటే ఇష్టపూర్వకంగా చెప్పారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 14 , 2024 | 02:57 PM