Arvind Kejriwal: కేజ్రీవాల్ వ్యవహారంలో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈడీ అధికారులపైనే గూఢచర్యం
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:06 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యవహారంలో తాజాగా మరో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులపైనే గూఢచర్యం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యవహారంలో తాజాగా మరో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులపైనే గూఢచర్యం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డాక్యుమెంట్‌లో ఈడీలోని ఇద్దరు ఉన్నత అధికారుల గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం.. కేజ్రీవాల్‌కు మరిన్ని కష్టాలు తప్పవు. ఆయనపై గూఢచర్యం కేసు నమోదు కావచ్చు.
ప్రత్యేక డైరెక్టర్-ర్యాంక్ అధికారి, జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన వివరాలు అందులో ఉన్నాయని.. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లను బయటపెట్టలేదని తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న అధికారుల్లో ఒకరి పేరు ఆ పత్రాల్లో ఉండటం చూసి అధికారులందరూ షాక్‌కు గురయ్యారు. ఆ పత్రంలో పేరున్న జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారి.. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తుని పర్యవేక్షిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ గురించి కేజ్రీవాల్ రిమాండ్ నోట్‌లో కూడా ప్రస్తావించబడింది. ఈ డాక్యుమెంట్ రికవరి చేసుకున్న తర్వాత.. ఇద్దరు ఈడీ అధికారులపై నిఘా పెట్టినందుకు గాను కేజ్రీవాల్‌పై ప్రత్యేక కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది కూడా పరిశీలిస్తోంది. తదుపరి విచారణ, చర్యల కోసం.. దర్యాప్తు ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని ఏజెన్సీలోని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ డాక్యుమెంట్‌లో ఉన్న కచ్ఛితమైన సమాచారం బహిర్గతం కాలేదు కానీ.. ఈడీలోని సమగ్రత, ప్రోటోకాల్‌పై ప్రశ్నలు రేకెత్తుతోంది.
ఇదిలావుండగా.. గురువారం రాత్రి రెండు గంటల పాటు ప్ఱశ్నించిన తర్వాత కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ ‘కింగ్‌పిన్’ అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం ఈడీ వెల్లడించింది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని తెలిపింది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ చెప్పారని ఈడీ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి