Arvind Kejriwal: నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవి
ABN , Publish Date - Sep 24 , 2024 | 06:25 PM
నిజాయితీపరుడుగా తనకు ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని చెప్పారు.
ఛండీగఢ్: తనను దొంగ (Thief)గా చూపించేందుకే బీజేపీ అరెస్టు చేయించిందని, తానే దొంగనైతే రూ.3,000 కోట్లు జేబులో వేసుకునేవాడినని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) భాగంగా మంగళవారంనాడు జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ, అవినీతిపరుడైన వ్యక్తి వయో వృద్ధులకు ఉచిత తీర్ధయాత్రల పథకాన్ని ప్రవేశపెడతాడా అని ప్రశ్నించారు.
''నా తప్పేమిటి? ఢిల్లీకి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పేదల కోసం మంచి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడమే తప్పా?. ఇంతకుముందు ఢిల్లీలో ఏడెనిమిది గంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవి. కానీ ఇప్పుడు నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఢిల్లీ, పంజాబ్‌లో ఉచితంగా విద్యుత్ ఇవ్వడమే నా తప్పా?. నేనే దొంగనైతే రూ.3,000 కోట్లు నా జేబులో వేసుకుని ఉండేవాడిని. పేద ప్రజల కోసం మంచి స్కూళ్లు ఏర్పాటు చేశా. ఇదెంతో ఖర్చుతో కూడుకున్న పని. నేనే అవినీతిపరుడినైతే నా జేబులు నింపుకుని ఉండేవాడిని'' అని కేజ్రీవాల్ అన్నారు. నిజాయితీపరుడుగా తనకు ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని ఆరోపించారు. జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని, మందులు ఆపేశారని, పదేళ్లుగా తీసుకుంటున్న ఇన్సులిన్ నిలిపేశారని అన్నారు. తన కఠోర దీక్షను భగ్నం చేయాలనుకున్నారని, అయితే తాను హర్యానా నుంచి వచ్చాననే విషయం వారికి తెలిసి ఉండకపోవచ్చని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
నమ్మతేనే ఓటేయండి
కేజ్రీవాల్ నిజాయితీపరుడని నమ్మతేనే ఓటు వేయాలని ప్రజలను ఆయన కోరారు. తనను గెలిపించి నిజాయితీపరుడనే సర్టిఫికెట్ ఇస్తేనే ముఖ్యమంత్రి పీఠంపై తాను కూర్చుంటానని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5న జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
Read More National News and Latest Telugu News
ఇవి కూడా చదవండి:
NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..