Share News

BJP: కేజ్రీ రాజీనామా వెనక ఓ సీక్రెట్.. బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:58 PM

సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాననడం ఢిల్లీ ప్రజల విజయంగా బీజేపీ అభివర్ణించింది. సుప్రీం ఆంక్షలు ఉన్నందునే ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు ఆరోపించింది.

BJP: కేజ్రీ రాజీనామా వెనక ఓ సీక్రెట్.. బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాననడం ఢిల్లీ ప్రజల విజయంగా బీజేపీ అభివర్ణించింది. సుప్రీం ఆంక్షలు ఉన్నందునే ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు ఆరోపించింది. “రెండు రోజుల తర్వాత రాజీనామా చేసి ప్రజల నుంచి తీర్పు రాగానే మళ్లీ సీఎం అవుతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది త్యాగం కాదు, సీఎం కుర్చీ వద్దకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ఉత్తర్వుల వల్ల ఏ ఫైల్‌పైనా కేజ్రీవాల్ సంతకం చేయలేరు. సుప్రీం ఉత్తర్వుల వల్ల కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

3 నెలల క్రితం జైలా, బెయిలా అని ప్రజలను అడిగినప్పుడు వారు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. 7 (ఢిల్లీ లోక్‌సభ స్థానాలు) స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ రెండు రోజులు సమయం అడుగుతున్నారు. ఆయన భార్యను సీఎం కుర్చిలో కూర్చోబెట్టడానికి ఎమ్మెల్యేలందరినీ ఒప్పించారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నందునా.. ఇకపై ఆయన సీఎం పదవిలో కొనసాగే అవకాశం లేదు’’ అని బీజేపీ సీనియర్ మజీందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు.


సుప్రీంకోర్టు ఆదేశాలివే..

సెప్టెంబరు 13న ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సిర్సా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆప్ అధినేతకు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించకుండా, ఫైళ్లపై సంతకం చేయకుండా నిషేధించడంతో సహా కోర్టు కొన్ని షరతులను కూడా విధించింది. ఆ ఆంక్షలతోనే సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఆరోపించింది. “అవినీతిపరుడైన కేజ్రీవాల్ రాజీనామా చేయవలసిన సమయం వచ్చింది. సుప్రీం కోర్టు షరతుల కారణంగానే కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలన్న పట్టుదలతో ఉన్న వ్యక్తి ఇవాళ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు సాధించిన పెద్ద విజయం ఇది'' అని బీజేపీ మరో నేత కపిల్ మిశ్రా పేర్కొన్నారు.

కేజ్రీవాల్ రాజకీయ ఎత్తుగడతో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీకి చెందిన మరో నేత షాజియా ఇల్మీ విమర్శించారు. “అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ఎత్తుగడలో నిష్ణాతుడు.. జైల్లో ఉన్న 5 నెలల్లోనే రాజీనామా చేసి ఉండాల్సింది. సానుభూతి పొందాలంటే ఇదొక్కటే మార్గమని ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు రాజీనామా అంశం తెరపైకి తెస్తున్నారు. ప్రజామద్దతు కోల్పోయాక ఆయన నిజస్వరూపం బయటపడింది" అని షాజియా అన్నారు.

For More National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 03:53 PM