Share News

Ayodhya: రామయ్యకు భారీగా కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

ABN , Publish Date - Jan 20 , 2024 | 07:37 AM

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి.

Ayodhya: రామయ్యకు భారీగా కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి. ఇవేకాకుండా 108 అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల భారీ దీపం, బంగారు పాదుకలు, పది అడుగుల తాళం, ఏకకాలంలో 8దేశాల సమయాన్ని సూచించే గడియారం ట్రస్టుకు అందాయి. సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్‌ ధామ్‌ నుంచి వెండి పాదరక్షలు, ఆభరణాలు, వస్త్రాలతో పాటు 3వేలకు పైగా బహుమతులు కాన్వాయ్‌గా వచ్చాయి.

శ్రీలంక ప్రతినిధి బృందం అశోకవాటిక నుంచి ప్రత్యేక కానుక తీసుకొచ్చింది. ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ఆలయం నుంచి 5లక్షల లడ్డూలతో కూడిన ట్రక్‌ శుక్రవారం అయోధ్యకు బయల్దేరింది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్‌ నుంచి 200 కిలోల లడ్డూలు, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డూలు పంపారు. భక్తుల కోసం 7వేల కిలోల రామ్‌ హల్వాను తయారు చేయనున్నట్లు నాగపూర్‌కు చెందిన చెఫ్‌ విష్ణు మనోహర్‌ ప్రకటించారు. రాముడికి బంగారు పూతపూసిన పాదరక్షలను సమర్పించడానికి హైదరాబాద్‌కు చెందిన 64ఏళ్ల చల్లా శ్రీనివాస శాస్త్రి 8వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకున్నారు.


అంతా రామమయం!

కాగా రామాలయ ప్రతిష్ఠకు ముందు.. అయోధ్య మొత్తం రామమయమైంది. మొబైల్‌ ఫోన్ల కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌ టోన్లు, సోషల్‌ మీడియాలో శ్రీరాముడి పేరు మార్మోగిపోతోంది. అయోధ్య వీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. మరోవైపు, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు అయోధ్య జిల్లా, నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లను రిజర్వ్‌ చేసి ఉంచారు. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో ఎయిమ్స్‌ నిపుణులు స్థానిక ఆరోగ్య సంస్థల సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే వారికోసం ఈ బెడ్లను రిజర్వ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. కాగా, అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ జైళ్లలోని ఖైదీలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించనున్నారు.

ఇలాంటి మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 20 , 2024 | 11:15 AM