Bengaluru : సమాజంలో పత్రికలదే విశ్వసనీయత
ABN , Publish Date - Aug 11 , 2024 | 03:40 AM
సమాజంలో పత్రికలదే విశ్వసనీయత అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో భాగంగా రెండోరోజు శనివారం ఐదు వేదికల ద్వారా బెంగళూరు కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో ...
కొవిడ్ అనంతరం మీడియాలో సంక్లిష్ట పరిస్థితి
బుక్‌బ్రహ్మ చర్చాగోష్టిలో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్
బెంగళూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): సమాజంలో పత్రికలదే విశ్వసనీయత అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో భాగంగా రెండోరోజు శనివారం ఐదు వేదికల ద్వారా బెంగళూరు కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో సాహితీవేత్తలు, రచయితలు, భాషాభిమానులతో సందడి నెలకొంది. ‘మీడియాలో సాహిత్య ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిని ‘ది హిందూ’ ఎడిటర్ భాగ్యశ్రీ సుబ్బణ్ణ పర్యవేక్షించారు. కె.శ్రీనివాస్, డెక్కన్ హెరాల్డ్ ఎడిటర్ రామకృష్ణ, ప్రిజమ్ బుక్స్ నుంచి సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మేగజైన్లు ఎక్కువ సాహిత్యంతోనే సాగేవని, కొవిడ్ తర్వాత అవి బాగా తగ్గుముఖం పట్టాయని అన్నారు. పత్రికల్లోనూ 50 శాతం స్థలాభావం ఏర్పడిందన్నారు.
తెలుగులో 19వ శతాబ్దంలోనే మ్యాగజైన్ల ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆధ్యాత్మికం, సామాజిక అంశాలపై కథనాలు ఉండేవని తెలిపారు. ‘ఆంధ్రపత్రిక’ సాహిత్యంతోనే సుదీర్ఘకాలం కొనసాగిందని పేర్కొన్నారు. 1920లో భారతి, గోల్కోండ లాంటి మేగజైన్లు ప్రాచుర్యంలో ఉండేవని గుర్తుచేశారు. 1960లో ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు నేతృత్వంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రారంభమైందని, ఆయన సాహిత్యానికి నిరంతరం ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
ప్రస్తుతం ‘వివిధ’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో సాహిత్యానికి ప్రాధాన్యం నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. అన్ని తెలుగు పత్రికలు సాహిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడించారు. కొవిడ్ తర్వాత మీడియా సంక్లిష్ట పరిస్థితికి వచ్చిందన్న శ్రీనివాస్.. మేగజైన్లలో మంచి కథనాలు వచ్చేవని తెలిపారు. సంక్షిప్త కథనాలతో డిజిటల్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చినా అవి పబ్లిష్ కావన్నారు. దినపత్రికలకు విశ్వసనీయత ఉందని స్పష్టంచేశారు.
సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియాలో అప్పటికప్పుడు సమాచారం చేరినా పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు ఎడిటింగ్ ఉంటుందని, తద్వారా ప్రామాణికత, విశ్వసనీయత సాధ్యమవుతాయని వివరించారు. అందుకే ప్రజలు పత్రికలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మాతృభాషలో ఎప్పటికీ మార్పు ఉండదని, మరో 20-30 ఏళ్లపాటు పత్రికలకు ప్రాధాన్యం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో దళిత కిచెన్ వంటి అంశంపై కథనాలు పబ్లిష్ చేసే విషయమై పరిశీలిస్తామన్నారు. సుధీర్ మాట్లాడుతూ కేరళలో ఏటా 700-800 పుస్తకాలు ఇప్పటికీ పబ్లిష్ అవుతున్నాయన్నారు. సాహిత్య పర్యవేక్షణలో నాణ్యత ముఖ్యమని అన్నారు. ఏఐ టెక్నాలజీ సాహిత్యంలోనూ ప్రవేశిస్తోందని తెలిపారు.