Ola Driver: మహిళకు భయంకరమైన అనుభవం.. రూ.100 కోసం ఓలా డ్రైవర్ అరాచకం
ABN , Publish Date - Jul 11 , 2024 | 06:46 PM
ఈమధ్య కాలంలో కొందరు క్యాబ్ డ్రైవర్లు కస్టమర్ల పట్ల రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. యాప్‌లలో చూపించే నిర్దిష్ట ధరల కన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే...
ఈమధ్య కాలంలో కొందరు క్యాబ్ డ్రైవర్లు (Cab Drivers) కస్టమర్ల పట్ల రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. యాప్‌లలో చూపించే నిర్దిష్ట ధరల కన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో (Bengaluru) చోటు చేసుకుంది. యాప్‌లో చూపించిన దానికంటే మరో రూ.100 ఎక్కువ ఇవ్వాలంటూ ఓ మహిళ పట్ల ఓలా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ భయంకరమైన అనుభవాన్ని ఆమె ఎక్స్ వేదికగా పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ మహిళ పేరు తనీషా మాల్యా. బెంగళూరుకి చెందిన ఆమె పని నిమిత్తం బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగొచ్చే క్రమంలో ఓలా ఆటో బుక్ చేసింది. తన లొకేషన్‌కు చేరుకునేదాకా అంతా బాగానే ఉంది కానీ, ఆటో దిగాక అసలు సమస్య మొదలైంది. ఆ వివరాలను ఆమె ఎక్స్‌లో పంచుకుంటూ.. ‘‘నేను ఇంటికి తిరిగొచ్చేందుకు ఓలా ఆటో బుక్ చేశాను. మొబైల్ యాప్‌లో 25 కిలోమీటర్లకు గాను రూ.347-356 ఛార్జ్ చూపించింది. అయితే.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్ రూ.470 చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఎందుకంటే.. తాను 45 కి.మీ కంటే ఎక్కువ డ్రైవ్ చేశానని అతను చెప్పాడు. కానీ.. ఇరువురి ఫోన్లలోని ఓలా యాప్‌లో మాత్రం రూ.356 చెల్లించాలని స్పష్టంగా చూపిస్తోంది. అయినా తాను అడిగిన మొత్తం ఇవ్వాలని డ్రైవర్ అరిచాడు’’.
‘‘అందుకు నేను నిరాకరించడంతో.. పరిస్థితి మరింత దారుణంగా మారింది. డ్రైవర్ కోపంగా ఆటో దిగి.. నాపై దూకుడుగా వచ్చాడు. గట్టిగట్టిగా మాట్లాడుతూ.. దుర్భాషలాడాడు. రూ. 470 ఇవ్వకపోతే.. ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే వదిలేస్తానంటూ అతడు బెదిరించాడు. అయినా నేను భయడపకుండా రూ.356 చెల్లించి, అపార్ట్‌మెంట్ గేటు లోపలికి ప్రవేశించాను. అయినా అతను వదలకుండా మరింత రెచ్చిపోయాడు. కన్నడంలో తిడుతూ.. సమస్యని ఇంకా పెద్దది చేయాలని చూశాడు. ఇంతలో నాన్న వచ్చాక ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తే.. నేనే అబద్ధం చెప్పానంటూ ఆ డ్రైవర్ నా ముఖంపై కేకలు వేశాడు’’ అంటూ తనీషా రాసుకొచ్చింది. తనకు కన్నడ వచ్చు కాబట్టి సరిపోయిందని, ఆ భాష రాని వాళ్ల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో తనకు ఓలా నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని, కస్టమర్ కేర్‌తో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని తనీషా పేర్కొంది. మీటర్ ప్యాటర్న్‌ల ఆధారంగా ఓలా కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయడమే.. ఈ ఛార్జీల వ్యత్యాసానికి కారణమని ఆమె గుర్తించారు. ఈ వ్యవహారమంతా 10 నిమిషాల వ్యవధిలోనే రాత్రి 8.10 గంటల సమయంలో జరిగిందని పేర్కొంది. తాను ఆ డ్రైవర్‌ఫై ఫిర్యాదు చేయాలనుకున్నానని.. కానీ సీఎన్ఆర్ నంబర్ ఉన్నప్పటికీ అతని వివరాలు లేవని చెప్పింది. ఆమె చేసిన ఈ ట్వీట్లు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లు స్పందించి, నిర్దిష్ట వివరాలు షేర్ చేయాలని కోరారు. మరోవైపు.. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. బెంగుళూరులోని ఆటో వాళ్లంతా మాఫియా గ్యాంగ్ అని కామెంట్లు చేస్తున్నారు.
Read Latest National News and Telugu News