Share News

Bharat Bandh: రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా నిరసన.. బ్యాంకులు, స్కూల్స్ మూసి వేస్తారా?

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:20 PM

రేపు (ఫిబ్రవరి 16న) భారత్ బంద్ కొనసాగనుంది. రైతు సంఘాలన్నీ ఏకమై భారత్ బంద్‌లో పాల్గొనాలని ఐక్య కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా స్కూల్స్ బంద్ ఉంటాయా లేదా అనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

Bharat Bandh: రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా నిరసన.. బ్యాంకులు, స్కూల్స్ మూసి వేస్తారా?

రేపు (ఫిబ్రవరి 16న) భారత్ బంద్ కొనసాగనుంది. రైతు సంఘాలన్నీ ఏకమై భారత్ బంద్‌లో పాల్గొనాలని ఐక్య కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు ఈ నిరసనలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని కొన్ని రాష్ట్ర, జాతీయ రహదారులు శుక్రవారం నాలుగు గంటల పాటు మూసివేయబడతాయి. ఈ ఆందోళనకు దేశంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలతోపాటు అనుబంధ సంఘ కార్మికులు కూడా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.


భారత్ బంద్ నేపథ్యంలో వివిధ ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు శుక్రవారం మూసివేయబడతాయి. దీంతో పాటు రవాణా, వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) గ్రామీణ పనులు, గ్రామీణ పారిశ్రామిక, సేవా రంగ సంస్థలు, మూతపడే అవకాశం ఉంది. భారత్ బంద్ రోజున కూరగాయలు, ఇతర పంటల సరఫరాపై కూడా ప్రభావితం ఉండవచ్చు. శుక్రవారం భారత్ బంద్ సందర్భంగా అంబులెన్స్, పెళ్లిళ్లు, మెడికల్ షాపులు, పాఠశాలలు, పరీక్షలు తదితర అత్యవసర సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంతే కాకుండా బ్యాంకులు కూడా తెరిచి ఉంటాయి.

అయితే పంటలకు కనీస మద్దతు ధర, కొనుగోలుకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ, విద్యుత్తు పెంపు నిలుపుదల వంటి డిమాండ్లను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దీంతోపాటు గృహావసరాలకు, దుకాణాలకు వ్యవసాయానికి ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్తు, సమగ్ర పంటల బీమా, నెలకు రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అందుకే ఈ ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 03:20 PM