Bhupinder Singh Hooda: అలసి పోలేదు, రిటైర్ కాలేదు.. రేసులో ఉన్నానన్న మాజీ సీఎం
ABN , Publish Date - Aug 13 , 2024 | 08:27 PM
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అన్నారు. తాను అలసిపోలేదని, రిటైర్ కాలేదని నవ్వుతూ చెప్పారు. పార్టీ మెజారిటీ సీట్లలో గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎవరనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని తెలిపారు.
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా (Bhupinder Singh Hooda) అన్నారు. తాను అలసిపోలేదని, రిటైర్ కాలేదని నవ్వుతూ చెప్పారు. పార్టీ మెజారిటీ సీట్లలో గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎవరనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని తెలిపారు.
రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న హుడా మంగళవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ హర్యానాలో పార్టీ మంచి ఫలితాలను రాబట్టిందని అన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయాలనే స్ధిర నిశ్చయంతో ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Adani-Hindenburg row: సెబీ చీఫ్‌ను తొలగించాలంటూ 22న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు
ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా?
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తుందా అనే ప్రశ్నకు అలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితమైన ప్రక్రియను అనుసరిస్తుందని హుడా చెప్పారు. ''ఎన్నికలు జరుగుతాయి, ఎమ్మెల్యేలు ఎన్నికవుతారు, పరిశీలకులను పంపుతారు, వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు, అప్పుడు సీఎం ఎవరనే దానిపై వాళ్లు (అధిష్ఠానం) నిర్ణయం తీసుకుంటారు'' అని హుడా సమాధానమిచ్చారు. తదుపరి సీఎం రేసులో దీపేందర్ సింగ్ హుడా (భూపిందర్ కుమారుడు) రేసులో ఉంటారా? అని అడిగినప్పుడు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా అధిష్ఠానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని, తన వరకు అయితే తాను అసలిపోలేదని, రిటైర్ కూడా కాలేదని నవ్వుతూ సమాధానమిచ్చారు. పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని హుడా తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయలు ఉంటాయే కానీ, వర్గ విభేదాల్లేవని, ఏదైనా ఉంటే బీజేపీలోనే ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని, లోక్‌సభలో ఏవిధంగా కలిసికట్టుగా పోరాడామో అసెంబ్లీ ఎన్నికలను కూడా అదే విధంగా ఎదుర్కొంటామని చెప్పారు. 90 మంది సభ్యులున్న ప్రస్తుత హర్యానా అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 3న ముగియనుంది.
Read More National News and Latest Telugu News