Share News

Lok Sabha Elections: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రానుంది.. మోదీ జోస్యం

ABN , Publish Date - May 20 , 2024 | 03:33 PM

అవినీతిపై ఒడిశాలోని బిజూ జదనతాదళ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనుండటం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

Lok Sabha Elections: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రానుంది.. మోదీ జోస్యం

కటక్: అవినీతిపై ఒడిశా(Odisha)లోని బిజూ జదనతాదళ్ (BJD) ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi_ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనుండటం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కట్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని మీడియా చెబుతోందని, కానీ అది నిజం కాదని అన్నారు. ఒడిశాలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేడీ రాష్ట్రానికి ఏదైనా ఇచ్చి ఉంటే అది భూ మాఫియా, ఇసుక, బొగ్గు, మైనింగ్ మాఫియా మాత్రమేనని అన్నారు.


జూన్ 10న ఒడిశాలో ప్రమాణస్వీకారం..

''మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేశారు. మొదటి సారి ప్రజల్లో ఎంతో ఉత్సుకత కనిపిస్తోంది. 25 ఏళ్ల తర్వాత కనిపిస్తున్న ఈ ఉత్సాహం చూస్తుంటే ఒడిశా కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమైనట్టే. జూన్ 10న ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయడం తథ్యం. మీ అందరి ఆశీస్సులతో మోదీ ప్రభుత్వం ఢిల్లీలో మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తుంది'' అని మోదీ అన్నారు.


ఒడిశాలోని అధికార బీజేడీ ప్రభుత్వంపై మోదీ విరుచుకుపడుతూ, కటక్ ప్రజల సమస్యలు బీజేడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కటక్ చుట్టూ నదులున్నా తాగునీటి సమస్య ఉందని, ట్యాపుల ద్వారా నీళ్లు ఇవ్వాలని తాను కోరుకున్నప్పటికీ వాళ్లు అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేడీ తప్పిదాలను ఈ ఎన్నికల్లో ప్రజలు శిక్షించబోతున్నారని, బీజేపీ ప్రభుత్వం తప్పదాలు, ప్రజలను లూటీ చేయడం పూర్తిగా ఈ ఎన్నికల్లో బయటపడ్డాయని చెప్పారు. బీజేడీ అవినీతితో యువత బాగా నష్టపోయిందని, వలసలు పోతున్నారని, పెట్టుబడులకు అవసరమైన వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించడంలేదని, ప్రతి రంగాన్ని ఆక్రమించిన మాఫియా ఇక్కడకు ఎలాంటి పోటీని అనుమంతిచడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని దయనీయ స్థితిలోకి బీజేడీ నెట్టేసిందని అన్నారు. ఈ ఎన్నికలు చాలా విలువైనవనీ, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారందరినీ శిక్షించాలని పిలుపునిచ్చారు. కాగా, దీనికి ముందు కటక్‌లో మోదీ రోడ్‌షో నిర్వహించారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 20 , 2024 | 03:33 PM