Share News

Ayodhya: రామమందిరం ఆహ్వానాన్ని సోనియా తిరస్కరించడంపై బీజేపీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Jan 10 , 2024 | 06:13 PM

అయోధ్య రామాలయంలో ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరస్కరించడంపై బీజేపీ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ చింతించాల్సి వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పురి అన్నారు.

Ayodhya: రామమందిరం ఆహ్వానాన్ని సోనియా తిరస్కరించడంపై బీజేపీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తిరస్కరించడంపై బీజేపీ (BJP) తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ చింతించాల్సి వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) అన్నారు. రామాలయ అంశంపై కాంగ్రెస్ పార్టీ మొదట్నించి ఇదే ధోరణి అవలంభిస్తోందని, ఈ విషయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.


ఆశ్చర్యమేమీ లేదు: నలిన్ కోహ్లీ

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తమకు ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ నేత నలిన్ కోహ్లీ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయం కోసం కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సుప్రీంకోర్టు తీర్పును జాప్యం చేస్తూ వచ్చారని, ఈ క్రమంలో ఇప్పుడు రామమందిరం ప్రాణప్రతిష్ఠకు హాజరుకావడం లేదని చెప్పడంలో ఆశ్చర్యపడేదేమీ లేదని అన్నారు.


రాముడు కోట్లాది మంది ఆరాధ్యదైవమే కానీ..: జైరామ్ రమేష్

కాగా, రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలంటూ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు తిరస్కరించింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అని, ఇది ముమ్మాటికి ఎన్నికల మైలేజీ కోసం చేపట్టిన స్టంట్ అని విమర్శించింది. దీనిపై పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని లక్షలాది మంది రాముని ఆరాధిస్తారని, మతం అనేది వ్యక్తిగత అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే చిరకాలంగా అయోధ్యలోని రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా బీజేపీ మార్చిందని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న రామాలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెరపైకి తెచ్చిందన్నారు. 2019 సుప్రీంకోర్టు తీర్పును, రాముని ఆరాధించే కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అయితే ఇది స్పష్టంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మార్చినందున మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్ చౌదరి మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టు జైరామ్ రమేష్ ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jan 10 , 2024 | 06:13 PM