Share News

Parliament: అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు.. దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:38 AM

బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇక ప్రతిపక్షాలకు పోటీగా అధికార బీజేపీతోపాటు మిత్ర పక్షాలు సైతం నిరసన చేపట్టాయి. దీంతో గురువారం పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లి పోయింది.

Parliament: అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు.. దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతోపాటు ఇండియా కూటమిలోని నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ చిత్రపటాలతోపాటు ప్లకార్డులు పట్టుకుని వారంతా అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా క్షమాపణలు చెప్పడంతోపాటు.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర్ ద్వార్ వరకు వారంతా పాదయాత్ర చేపట్టారు.

Also Read: అమిత్ షాపై హీరో విజయ్ ఫైర్


మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ సభ్యులు సైతం నిరసన బాట పట్టారు. బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ వారు సైతం ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు. అంతేకాకుండా.. ‘బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తే సహించేది లేదంటూ, అంబేద్కర్ తమకు దారి చూపించారు.. కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించిందంటూ బ్యానర్లు పట్టుకుని బీజేపీ ఎంపీలు పెద్ద పెట్టున.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read: ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ.. కీలక నిర్ణయం


అయితే బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గాంధీ కుటుంబన్ని విమర్శించారు. అయితే గాంధీ కుటుంబంలోని వారంతా భారతరత్నలు అందుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టి.. ఆ పార్టీ చేసిన తప్పలకు ప్రాయశ్చితంగా మౌనం పాటించాలని గాంధీ కుటుంబానికి కేంద్ర మంత్రి సూచించారు. మరోవైపు అమిత్ షా క్షమాపణతోపాటు రాజీనామా కోరుతూ.. పార్లమెంట్ ప్రధాన ద్వారం మకర్ ద్వార్ గోడలు ఎక్కారు. ఇఖ రాహుల్ గాంధీ.. ఓ ఎంపీని తమపైకి నెట్టడం వల్ల ఓ ఎంపీ గాయపడ్డారని బీజేపీ పేర్కొంది.


పార్లమెంట్‌లో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపిస్తూ అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేయడంతో పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా అంబేద్కర్ ను అవమాన పరిచిందని బీజేపీ ఆరోపించింది. అలాగ అమిత్ షా ప్రసంగానికి సంబంధిన వీడియోను సైతం ఆ పార్టీ తారుమారు చేసిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ హెచ్చరించింది.


ఇక లోక్ సభ ప్రారంభమైంది. సభలోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు. దీంతో లోక్ సభను మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

For National news And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 11:59 AM