Lok Sabha Elections: రాహుల్ వయనాడ్ పోటీ వెనుక కారణం అదే... బీజేపీ విసుర్లు
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:27 PM
లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. అక్కడ మెజారిటీ ప్రజలు మైనారిటీలు కావడమే కారణమని పేర్కొంది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తిరిగి కేరళలోని వయనాడ్ (Wayanad) నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. అమేథీ నుంచి రాహుల్ ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీసింది. మైనారిటీ రాజకీయాలపైనే కాంగ్రెస్ పార్టీ ఆధారపడినందునే వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయాలనుకుంటున్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) అన్నారు.
''యావద్దేశం కాంగ్రెస్ వెంటే ఉందని ఆయన (రాహుల్) చెబుతున్నారు. అటువంటప్పుడు అమేథీ నుంచి ఆయన ఎందుకు పోటీ చేయడం లేదు? దానికి కారణం లేకపోలేదు. వయనాడ్‌లో మెజారిటీ ప్రజలు మైనారిటీలే. కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం మైనారిటీలపైనే ఆధారపడి నడుస్తుంటాయి'' అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
కాగా, రాహుల్ గాంధీ తిరిగి వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు గురువారంనాడు సమావేశమైన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నారు. రాహుల్ 2004, 2009, 2014లో అమేథీ నుంచి గెలుపొందారు. అయితే 2019లో అమేథీలో ఓటమి చవిచూశారు. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లో రాహుల్ పోటీచేయడంతో అక్కడ గెలుపొందారు.
50 మందికి లైన్‌క్లియర్
కాంగ్రెస్ సీఇసీ సమావేశంలో 50 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆ ప్రకారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తిరువనంతపురం నుంచి తిరిగి పోటీ చేస్తారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పేర్లు కూడా ఖరారయ్యాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి జ్యోత్స్న మెహంత్ పోటీకి కూడా మార్గం సుగమమైంది. సీఈసీ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరుకాగా, జూమ్ మీటింగ్ ద్వారా రాహుల్ గాంధీ పాల్గొన్నారు.