Share News

Lok Sabha Polls: బీజేపీకి షాక్... ఎంపీ అజయ్ నిషాద్ రాజీనామా, కాంగ్రెస్‌లో చేరిక

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:19 PM

లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లోని ముజఫర్‌పూర్ బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి చెందిన అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నిషాద్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Lok Sabha Polls: బీజేపీకి షాక్... ఎంపీ అజయ్ నిషాద్ రాజీనామా, కాంగ్రెస్‌లో చేరిక

ముజఫర్‌పూర్: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ బీహార్‌లోని ముజఫర్‌పూర్ బీజేపీ (BJP) ఎంపీ అజయ్ నిషాద్ (Ajay Nishad) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి చెందిన అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నిషాద్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేర సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిషాద్ రాకతో ముజఫర్‌పూర్, దర్బంగా, చంపారాన్, మధుబని ప్రాంతాల్లో ఈబీసీ ఓట్లు తమకు అనుకూలంగా పడతాయని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. దీనికి ముందు చురు ఎంపీ రాహుల్ కాస్వాన్, హిసార్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు.


బీజేపీ నయవంచన...

బీజేపీ వంచన కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు అజయ్ నిషద్ ఓ ట్వీట్‌లో తెలిపారు. బీజేపీ నయవంచనతో తాను దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆ కారణంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశానని చెప్పారు. ఉరిశిక్ష విధించిన వ్యక్తిని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారని, బీజేపీ కనీసం ఒక్కసారి కూడా తనను సంప్రదించకుండా టిక్కెట్ రద్దు చేసిందని, మీడియా ద్వారా తనకు ఆ విషయం తెలిసిందని, ఇదెంతమాత్రం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


2014 నుంచి ముజఫర్‌పూర్ బీజేపీ ఎంపీగా ఉన్న నిషాద్ తన రాజీనామాకు ముందు తన ట్విటర్ ఖాతా నుంచి ''మోదీ కా పరివార్'' ట్యాగ్‌ను తొలగించారు. 2014 ఆయన ప్రస్తుత బీహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్‌ను 2 లక్షల 22 వేల ఓట్ల తేడాతో ఓడించారు. 2019లో కూడా ముఖేష్ సాహ్ని పార్టీ అభ్యర్థి రాజ్ భూషణ్ చౌదరి నిషాద్‌ను ఆయన ఓడించారు. అయితే, ఈసారి అజయ్ నిషాద్‌కు బదులుగా రాజ్ భూషణ్ చౌదరి నిషాద్‌ను ముజఫర్‌పూర్ నుంచి బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 03:19 PM