Share News

BJP: బీజేపీ కూటమి వైపు డీఎండీకే.. 4 సీట్లు కోరుతున్న ప్రేమలత?

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:24 PM

డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న బీజేపీ(BJP).. డీఎండీకేను దరి చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.

BJP: బీజేపీ కూటమి వైపు డీఎండీకే.. 4 సీట్లు కోరుతున్న ప్రేమలత?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న బీజేపీ(BJP).. డీఎండీకేను దరి చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కూటమిలో చేరేందుకు టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం వర్గం, ఏసీ షణ్ముగం నేతృత్వం వహిస్తున్న న్యూజసిస్‌ పార్టీ అంగీకరించాయి. అయితే ఈ కూటమిని మరింత బలోపేతం చేసుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అదే సమయంలో ఈ కూటమిలో చేరేందుకు డీఎండీకే(DMDK) కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) షరతులు విధించినట్లు సమాచారం. తమ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంక్‌ ఉన్న నియోజకవర్గాలను కేటాయించాలని కోరినట్టు సమాచారం. అందుకు బీజేపీ నేతలు కూడా సమ్మతించినట్టు తెలిసింది. దీంతో బీజేపీ కూటమిలో డీఎండీకే చేరడం ఖాయమైంది. విజయకాంత్‌ మరణించిన సమయంలో బీజేపీ పెద్దలు స్పందించారు. అంతేగాక ప్రధాని మోదీ సైతం విజయకాంత్‌ను కీర్తిస్తూ సందేశం పంపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం విజయకాంత్‌కు పద్మభూషణ్‌ ప్రకటించింది. దీనిపట్ల డీఎండీకే శ్రేణులు సైతం ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమితో కలిసి సాగడమే మంచిదన్న ఉద్దేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఉన్నట్లు తెలిసింది. తమకు కళ్లకుర్చి, మదురై సహా నాలుగు లోక్‌సభ స్థానాలు, రాజ్యసభ సీటు కేటాయించాలని ఆమె బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ కూడా తమ పార్టీ గెలిచే అవకాశాలున్న 20 నియోజకవర్గాల పేర్లున్న జాబితాను బీజేపీకి సమర్పించినట్లు తెలుస్తోంది.

nani2.2.jpg

రాందాస్‏తో సీవీ షణ్ముగం భేటీ...

పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందా్‌సను అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ఆకస్మికంగా కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి దిండివనం సమీపం తైలాపురం గార్డెన్‌లోని రాందాస్‌ నివాస గృహానికి సీవీ షణ్ముగం వెళ్లి ఆయనతో ఎన్నికల పొత్తుపై చర్చలు జరిపారు. అరగంటసేపు ఈ సమావేశం కొనసాగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) సూచన మేరకే షణ్ముగం పీఎంకే నేత రాందా్‌సతో పొత్తుపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ కంటే ఎక్కువసీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా షణ్ముగం తెలిపారు. బీజేపీ కూటమిలో చేరేందుకు తమ పార్టీకి 22 సీట్లు కేటాయించాలంటూ ఇదివరకే పీఎంకే ప్రతిపాదించింది. అయితే పీఎంకేకు ఏడు సీట్లు మాత్రమే కేటాయిస్తామని బీజేపీ అధిష్ఠానం పేర్కొంది. ఈ విషయాన్ని షణ్ముగం ప్రస్తావిస్తూ తమ పార్టీ ఏడు సీట్ల కంటే ఒకటి రెండు సీట్లు అధికంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని రాందాస్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

Updated Date - Feb 07 , 2024 | 12:24 PM