BJP state chief: రాజకీయ లబ్ధి కోసమే డీఎంకే కూటమిలో కమలహాసన్..
ABN , Publish Date - Mar 13 , 2024 | 12:34 PM
లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మక్కల్ నీది మయ్యం కట్చి అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు.
- బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై విమర్శ
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మక్కల్ నీది మయ్యం కట్చి అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు నిస్వార్థసేవలు అందించడమే తన లక్ష్యమని పదేపదే పలు వేదికలపై ప్రకటించిన కమల్ రాజకీయ లబ్ధి కోసం డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడం సమంజసం కాదని అన్నామలై(Annamalai) వ్యాఖ్యానించారు. కోయంబత్తూర్ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... డీఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సంఘ విద్రోహులకు అధికారపార్టీ అండగా ఉందన్నారు. రాష్ట్రప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, అది బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించే విజయంతో తాము అనుకున్నది నెరవేరుస్తామన్నారు. ప్రజలు ఎదురుచూస్తున్న మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎంపీ, ఎమ్మెల్యే కావాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. తమ లక్ష్యం 2026 అసెంబ్లీ ఎన్నికలేనని, సెయింట్ జార్జి కోటపై బీజేపీ జెండా ఎగువ వేయాలన్నా లక్ష్యంతోనే తాను రాజకీయాలు సాగిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి 25 శాతానికి పైగా ఓటు బ్యాంక్ ఉందని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ శాతాన్ని రెండింతలు పెంచే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రచారం సాగిస్తున్నట్లు తెలిపారు. నటుడు కమల్‌హాసన్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న ఉద్ధేశంతోనే మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రారంభించినట్లు ముందు ప్రకటించారని, అయితే ఆయన తన లక్ష్యాన్ని విస్మరించి డీఎంకేతో చేతులు కలిపారని అన్నామలై విమర్శించారు.