BJP state president: ఇప్పుడు మార్పు రాకుంటే.. మరెప్పుడూ రాబోదు!
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:12 PM
ఇప్పుడు మార్పు రాకుంటే మరెప్పుడూ రాదని, అందుకోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానంటూ కోయంబత్తూర్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అన్నామలై(Annamalai) అన్నారు.
- ప్రజలకు అన్నామలై పిలుపు
చెన్నై: ఇప్పుడు మార్పు రాకుంటే మరెప్పుడూ రాదని, అందుకోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానంటూ కోయంబత్తూర్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అన్నామలై(Annamalai) అన్నారు. కోవై లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని తిరుప్పూర్ జిల్లా పల్లడం శాసనసభ నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో అన్నామలై పాల్గొని, ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు వ్యత్యాసమైనవని, ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాల్సి ఉందన్నారు. 400 స్థానాలు బీజేపీ చేజిక్కించుకొనేలా ఓటర్లు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం విరామం లేకుండా శ్రమిస్తున్నారన్నారు. తన తల్లిని చూసి రెండు నెలలు గడించిందన్నారు. ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ ఎవరో కూడా ప్రజలకు తెలియదని, కానీ తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో సార్లు నియోజకవర్గంలో పర్యటించానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అవసరమని, తనకు అవకాశం కల్పిస్తే సాధించుకు వస్తానని తెలిపారు.
బీజేపీ(BJP) అధికారంలో ఉన్న గుజరాత్‌లో 50 శాతం వ్యవసాయం పెరిగిందని, కానీ, రాష్ట్రంలో 14 శాతం తగ్గిందన్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను 40 నియోజకవర్గాల్లో గెలిపించాల్సిన అవసరం తనపై ఉందన్నారు. అందువల్లే తాను కలుసుకోలేదని భావించకుండా, మోదీయే అన్నామలై అనుకొని ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో ఐదేళ్లు మీకు సేవ చేసుకొనే అవకాశం తనకు కల్పించేందుకు మరో 25 రోజులు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు మంత్రి టీఆర్బీ రాజా డబ్బు సంచులతో తిరుగుతున్నారన్నారు. కోవైను వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపడతానని అన్నామలై హామీ ఇచ్చారు.