Delhi: కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై.. బీజేపీ, బీజేడీ పొత్తు రాజకీయాలు
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:02 PM
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడి అధికార బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీతో కటీఫ్ చెప్పి 15 సంవత్సరాలు గడుస్తోంది.
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడి అధికార బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీతో కటీఫ్ చెప్పి 15 సంవత్సరాలు గడుస్తోంది. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు పొడుస్తుందనే ఊహాగానాల నడుమ రాష్ట్ర బీజేపీ చీఫ్ మన్మోహన్ సమాల్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు.
"ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒడిశాలోని సామాన్యులకు చేరట్లేదు. దానికి సీఎం నవీన్ పట్నాయక్ సర్కారే కారణం. అందుకే బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోదు. పదేళ్లుగా నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఒడిశా ప్రజలకు చేరట్లేదు. నవీన్ సర్కార్ కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. ఒడిశాలో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవిస్తున్నాయి.
ప్రధాని మోదీ దార్శనిక నేతృత్వంలో రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కోరికలు నెరవేర్చడానికి బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. అభివృద్ధి చెందిన భారత్, ఒడిశాను రూపొందించడానికి బీజేపీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో 21 స్థానాల్లో, 147 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. అధికారం చేపడుతుంది. ఏ పార్టీతో మేం పొత్తు పెట్టుకోబోం" అని మన్మోహన్ పోస్ట్ చేశారు.
ఇది కాస్తా వైరల్‌గా మారింది. పట్నాయక్‌తో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్న వేళ.. ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలు బీజేడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. దీంతో బీజేడీతో పొత్తు అనవసరమనే అభిప్రాయం బీజేపీలో కలిగింది. అంటే బీజేపీ, బీజేడీ రెండు రానున్న సార్వత్రిక సమరంలో ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నాయన్నమాట.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి