Rahul Nyay Yatra: మోదీ నినాదాలతో బీజేపీ కార్యకర్తల స్వాగతం.. రాహుల్ ఏం చేశారంటే..?
ABN , Publish Date - Mar 05 , 2024 | 07:33 PM
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా మంగళవారంనాడు షాజపూర్ సిటీలో రాహుల్‌కు బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. రాహుల్ సైతం హుందాగా వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ కొద్దిసేపు వారితో ముచ్చటించి ఆ తర్వాత ముందుకు కదిలారు.
షాజపూర్: రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra) మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా మంగళవారంనాడు షాజపూర్ సిటీలో రాహుల్‌కు బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. రాహుల్ సైతం హుందాగా వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ కొద్దిసేపు వారితో ముచ్చటించి ఆ తర్వాత ముందుకు కదిలారు.
షాజపూర్ సిటీలో రాహుల్ యాత్ర సాగుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో రాహుల్ యాత్రకు స్వాగతం పలికారు. 'మోదీ మోదీ' అంటూ నినాదాలు చేశారు. రాహుల్ తన వాహనాన్ని అక్కడ ఆపి కిందకు దిగారు. నడుచుకుంటూ వారి ముందుకు వెళ్లారు. నవ్వుతూ పలకరించారు. అనతంరం తిరిగి తన వాహనం వద్దకు తిరిగి వెళ్తూ వారికి చేతులు ఊపారు. ఫ్లైయింగ్ కిస్‌లు విసిరుతూ ముందుకు కదిలారు. రాహుల్‌కు ఆహ్వానం పలకడంపై బీజేపీ కార్పొరేటర్ దూబే మాట్లాడుతూ, తమ కార్యకర్తలు చేసిన నినాదాలను ఎంతో హుందాగా రాహుల్ స్వీకరించారని, తాము ఆయనకు స్వాగతం పలికామని చెప్పారు. ఆయనకు పొటాటోలు కూడా బహుకరించామని చెప్పారు. రాహుల్‌కు పొటాటోలు బహుకరించడం వెనుక ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉందట. రాహుల్ గతంలో పొటాటాలను (బంగాళాదుంపలు) బంగారంగా మార్చవచ్చని చెప్పిన ఓ పాత వీడియోను బీజేపీ కార్యకర్తలు ఆయన యాత్ర సందర్భంగా గుర్తు చేసుకున్నారట. అనుకున్నదే తడపు రాహుల్‌కు పొటాటోలు గిఫ్ట్‌గా ఇచ్చారు.