Share News

Lok Sabha Elections 2024: బీజేపీ-బీజేడీలది 'వైవాహిక బంధం'.. రాహుల్ విసుర్లు

ABN , Publish Date - Apr 28 , 2024 | 07:36 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' ఉందని కూడా ఆయన ఆరోపించారు.

Lok Sabha Elections 2024: బీజేపీ-బీజేడీలది 'వైవాహిక బంధం'.. రాహుల్ విసుర్లు

కటక్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' (Married) ఉందని కూడా ఆయన ఆరోపించారు. రెండు పార్టీల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. కటక్‌లోని సలేపూర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


బీజేపీ, బీజేడీలు ఎన్నికల సమరంలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తుంటారని, నిజానికి రెండు పార్టీలు కలిసి పనిచేస్తుంటాయని రాహుల్ తెలిపారు. ''ఇక్కడ, బీజేపీ, బీజేడీ పెళ్లి చేసుకున్నాయి. పరస్పర సహకారం ఉంది'' అని అన్నారు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆయన సహచరుడు వీకే పాండియన్ అని చెప్పారు. పాండియన్, అమిత్‌షా, నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్‌లు ప్రజల సంపదను లూటీ చేస్తు్న్నారని ఆరోపించారు.


''మైనింగ్ కుంభకోణం ద్వారా రూ.9 లక్షల కోట్లు లూటీ చేశారు. భూ ఆక్రమణలతో రూ.20,000 కోట్లు లూటీ అయ్యాయి. ప్లాంటేషన్ స్కామ్ విలువ రూ.15,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఒడిశాలో, అటు కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తాం'' అని రాహుల్ అన్నారు. పేద కుటుంబాలను, కుటుంబానికి ఒక్కో మహిళను ఎంపిక చేసి ఆ మహిళ అకౌంట్‌లో ఏటా లక్ష రూపాయలు.. అంటే నెలకు రూ.8.500 చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు.

Lok Sabha Elections 2024: నవాబులు, నిజాంలపై ఈగ కూడా వాలనీయరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు


ఒడిశాకు వరాలు..

ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మహిళలకు రూ.2,000, నిరుద్యోగ యువతకు రూ.3,000, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కే ఎల్పీజీ సిలెండర్ ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అంకుల్ జీ (మోదీ) 22 మంది బిలియనీర్ల కోసం పనిచేస్తే, తాము కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేస్తాయని చెప్పారు. ఒడిశాలో నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 07:39 PM