Share News

Delhi : స్కూళ్లకు బాంబు బెదిరింపులు!

ABN , Publish Date - May 02 , 2024 | 04:01 AM

పాఠశాలల్లో బాంబులు పెట్టామనే బెదిరింపు ఈమెయిళ్లతో ఢిల్లీలో బుధవారం కలకలం చెలరేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు.

Delhi : స్కూళ్లకు బాంబు బెదిరింపులు!

  • 130 పాఠశాలలకు అజ్ఞాత ఈ మెయిళ్లు ..

  • ఢిల్లీలో కలకలం.. వణికిపోయిన విద్యార్థులు, తల్లిదండ్రులు

  • స్కూళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు

  • తనిఖీలు జరిపి ఏమీ లేదని తేల్చిన బాంబు స్క్వాడ్‌ బృందాలు

  • రష్యా నుంచి ఈమెయిళ్లు..ఐఎస్‌ హస్తం?

న్యూఢిల్లీ, మే 1: పాఠశాలల్లో బాంబులు పెట్టామనే బెదిరింపు ఈమెయిళ్లతో ఢిల్లీలో బుధవారం కలకలం చెలరేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు. యాజమాన్యాలు స్కూళ్లను మూసివేసి విద్యార్థులను ఇళ్లకు పంపించాయి. పోలీసు, భద్రతా దళాలు పాఠశాలల్లో తనిఖీలు జరిపి బాంబులు ఏమీ లేవని, బెదిరింపు ఈ మెయిళ్లు ఒట్టివేనని తేల్చారు.


ఈ మెయిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది అధికారికంగా వెల్లడి కాకపోయినా.. రష్యా నుంచి వచ్చినట్లు తెలుస్తోందని, అవన్నీ ఒకే విధంగా ఉన్నాయని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీతోపాటు నగర పరిసరాల్లోని నోయిడా, గ్రేటర్‌ నోయిడాల్లో ఉన్న దాదాపు 130 స్కూళ్లకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీంతో స్కూళ్ల సిబ్బంది ఓవైపు తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తూనే మరోవైపు పోలీసులకు, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. పిల్లల్ని స్కూళ్లో దించి గంట కూడా కాకముందే.. ‘ఎమర్జెన్సీ పరిస్థితి కారణంగా స్కూల్‌ను మూసేస్తున్నాం.. మీ పిల్లల్ని తీసుకెళ్లండి’ అని పాఠశాలల నుంచి ఫోన్‌ రావటంతో తల్లిదండ్రులు ఆదరబాదరగా తరలివెళ్లారు.


దీంతో అన్ని స్కూళ్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఆకస్మిక పరిణామంతో విద్యార్థులు వణికిపోయారు. బెదిరింపు ఈమెయిళ్లు వచ్చిన అన్ని స్కూళ్లలో బాంబు తనిఖీ దళాలు క్షుణ్ణంగా సోదాలు జరిపాయి. ఎక్కడా ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని తేల్చారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందిస్తూ.. బాంబు బెదిరింపు ఒట్టిదేనని.. పోలీసులు, భద్రతా సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావద్దని ఒక ప్రకటన విడుదల చేసింది.


పుకార్లను వ్యాపింపజేయటం కోసమే బెదిరింపు ఈమెయిళ్లను పంపించి ఉంటారని ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్‌ సీపీ మీనా పేర్కొన్నారు. కాగా, బెదిరింపు ఈ మెయిళ్లపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను గుర్తించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈమెయిళ్లు రష్యా నుంచి వచ్చినట్లు తెలుస్తోందని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సావరిమ్‌ అనే అరబిక్‌ పదంతో కూడిన ఈమెయిల్‌ ఐడీ నుంచి మెయిళ్లు వచ్చాయని, సదరు మెయిల్‌ ఐడీని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదసంస్థ ఉపయోగిస్తుందని ఓ పోలీసు అధికారి తెలిపారు.


బిహార్‌ రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు

బిహార్‌లోనూ బాంబు బెదిరింపు కలకలం రేపింది. రాజ్‌భవన్‌లో బాంబు అమర్చినట్లు మంగళవారం రాజ్‌భవన్‌ అధికారులకు, బిహార్‌ పోలీసులకు ఈ మెయిల్‌ వచ్చింది. వారు వెంటనే అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో రాజ్‌భవన్‌లో విస్తృతంగా తనిఖీలు చేశామని, అనుమానాస్పదంగా ఏమి కనిపించలేదని బుధవారం సీనియర్‌ పోలీసు అధికారి రాజీవ్‌ మిశ్రా తెలిపారు. దాన్ని ఆకతాయి చర్యగా తేల్చారు.

Updated Date - May 02 , 2024 | 05:13 AM