Share News

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. మీ కోసం మరో అద్భుత ప్లాన్..

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:11 PM

బీఎస్ఎన్ఎల్ సంస్థ తమ వినియోగదారుల కోసం మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకువచ్చింది. రూ.666ల ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్ ప్రకటిస్తూ కస్టమర్లకు శుభవార్త చెప్పంది.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. మీ కోసం మరో అద్భుత ప్లాన్..

ఇంటర్నెట్ డెస్క్: మెుబైల్ రీఛార్జ్ ప్లాన్‌ గడువు ముగుస్తోందంటేనే వినియోగదారుల గుండెలు జారిపోతున్నాయి. వందల రూపాయలు వెచ్చించి మెుబైల్ ప్లాన్ కొనాలంటే జేబులు ఖాళీ అవుతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. గడువు ముగుస్తోందంటే ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులు బెంబేలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ టెలికాం సంస్థలు రేట్లు పెంచడంతో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు వినియోగదారులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే వారి కోసం ఆ సంస్థ మరో కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. అతి తక్కువ ఖర్చుతో 105రోజులపాటు అపరిమిత కాల్స్, పరిమిత డేటా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.


రీఛార్జ్ ప్లాన్ ఇదే..

బీఎస్ఎన్ఎల్ సంస్థ తమ వినియోగదారుల కోసం మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకువచ్చింది. రూ.666ల ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్ ప్రకటిస్తూ కస్టమర్లకు శుభవార్త చెప్పంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రూ.666లతో రీఛార్జ్ చేస్తే 105రోజులపాటు ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత SMSల ప్రయోజనాన్ని పొందేలా ప్లాన్ రూపొందించింది. అలాగే పరిమిత ఇంటర్నెట్ డేటాను సైతం ఈ ప్లాన్ అందిస్తోంది. మొత్తం 105రోజులకు గానూ 210 GB డేటాను అందిస్తోంది. దీని ప్రకారం ప్రతి రోజూ 2GB హై-స్పీడ్ డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందించే రూ.666ల ధరతో పోలిస్తే జియో, ఎయిర్‌టెల్, వీఐ నెట్‌వర్క్‌ల్లో ఇలాంటి ప్లాన్ మరొకటి లేదు. ఈ ఆఫర్ ప్రకటించడంపై బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ ద్వారా ఈ నెట్‌వర్క్‌కు మరింత మంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


అయితే ఇటీవల జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గడంపై అంచనాల కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. బీఎస్ఎన్ఎల్‌లో దిగజారుతున్న సేవల నాణ్యత వల్ల వచ్చిన కస్టమర్లు తిరిగి వెళ్లిపోతున్నారని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ పేలవమైన మెుబైల్ సేవలు అందిస్తోందని వారు మీటింగ్‌లో చెప్పారు. దీనికి సంబంధించి తాము స్వయంగా ఎదుర్కొన్న మెుబైల్ నెట్‌వర్క్ సమస్యలను సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు.


ఈ సందర్భంగా రాబోయే ఆరు నెలల్లో బీఎస్ఎన్ఎల్ సేవల్లో గణనీయమైన మెరుగుదల ఉంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారులు అంచనాల కమిటీ ప్యానెల్‌కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 24,000 టవర్లను లక్ష టవర్లకు పెంచే ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన ప్రణాళికను ప్యానెల్ సభ్యులకు వివరించారు. మరో ఆరు నెలల్లో టవర్లను లక్షకు పెంచి మెరుగైన మౌలిక వసతుల ద్వారా అత్యుత్తమ 4G సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి "ఆత్మనిర్భర్ భారత్" లో భాగంగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు అంచనాల కమిటీకి వివరించారు.

Updated Date - Oct 11 , 2024 | 05:11 PM